సమన్వయంతో పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

మండల వైద్యాధికారిణి పోరండ్ల నాగరాణి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మార్చి 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అనుబంధ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని మొగుళ్ళపల్లి వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి వైద్య సిబ్బందికి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలకు, అంగన్వాడి కార్యకర్తలకు, వైద్య సిబ్బందికి పోలియో చుక్కలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలంలోని 5 సంవత్సరాలున్న పిల్లలు 3341 మంది ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేయాలని కోరారు. పోలియో చుక్కలు వేసేందుకు మండలంలో 28 బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలియో చుక్కలు వేసుకోని పిల్లల కోసం మార్చి 4, 5న వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఈ అవకాశాన్ని మొగుళ్ళపల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా వైద్య సిబ్బందికి మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటస్వామి, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *