సోమ రాజన్న త్యాగస్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

సోమ రాజన్న వర్ధంతి సభలో యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట,నేటిధాత్రి :

యంసిపిఐ (యు) వ్యవస్థాపక నేతల్లో ఒకరైన కామ్రేడ్ సోమ రాజన్న త్యాగాలను, పోరాటాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా ఉద్యమాలను నిర్మించడమే ఆ మహానుభావుడికి అర్పించే నిజమైన నివాళులు అని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. గురువారం నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన కామ్రేడ్ సోమ రాజన్న 10 వ వర్ధంతి సభ జరిగింది.ఈ సందర్భంగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ నర్సంపేట మండలం మాదన్న పేట గ్రామంలో జన్మించిన కామ్రేడ్ రాజన్న పీడిత ప్రజల పక్షాన గొంతు కలిపి అనేక దాడులు దౌర్జన్యాలు, నిర్బంధాన్ని, జైలు జీవితాన్ని ఎదుర్కొని పోరాడిన కష్టజీవుల కడలి తరంగం అని అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో అమరజీవి మద్ది కాయల ఓంకార్ తో కలిసి రైతులు,కూలీలను ఏకం చేసి భూస్వామ్య,జమీందారీ వ్యవస్థపై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు.సుమారు లక్ష ఎకరాల భూస్వాముల భూములు,పంచరాయి,పొరంబోకు, ప్రభుత్వ మిగులు భూములు ప్రజల పరం చేసారని అన్నారు. దీనితో కక్ష కట్టిన భూస్వామ్య, నరహంతక గుండాలు కామ్రేడ్ రాజన్నపై ఐదు సార్లు హత్యా ప్రయత్నం చేశారని,
చివరికి ములుగు రామచంద్ర పురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాడు సాయుధ ముఠా కామ్రేడ్ రాజన్నను హత్య చేయడానికి వచ్చి జరిపిన కాల్పుల్లో కామ్రేడ్ మహ్మద్ సర్వర్ హత్య చేయబడగా, మరో ముగ్గురు కార్యకర్తలు తీవ్ర గాయాలతో బయటపడ్డారని అన్నారు.
రాజన్న పేద ప్రజలకు విద్య, వైద్యం, గృహవసతి, పోలీసు స్టేషన్,యంఆర్వో, ఆర్డివో,కలెక్టర్, ఎక్సైజ్ ఆపీసు, కోర్టు సమస్యలు ఏదైనా అక్కడ కార్యకర్తల అండగా నిలిచి సాదించిన మహా నాయకుడని తెలిపారు. ఆయన ఆశయ త్యాగం ఎంత గొప్పదని, ఏ ప్రజా పదవినీ ఆశించకుండా, ప్రజలకోసమే జీవితాన్ని అంకితం ఇచ్చిన నాయకుడు కామ్రేడ్ సోమ రాజన్న అని అన్నారు.రానున్న కాలంలో రాజన్న దారిలోనే ప్రజా ఉద్యమాలు ఉదృతంగా నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,సీనియర్ నాయకులు నాగెల్లి కొమురయ్య,జిల్లా నాయకులు,సింగతిమల్లిఖార్జున్, కే శెట్టి సదానందం,కలకోట్ల యాదగిరి, కొప్పుల సమ్మక్క, కేశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!