
Children and child labor
బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం..
మందమర్రి నేటి ధాత్రి
బాల కార్మికుల సంకెళ్లని తెంచుదాం.. ప్రభుత్వానికి ఫిర్యాదు చేద్దాం.. అనే నినాదంతో కూడిన కరపత్రాల ద్వారా ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం పై సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యులు పట్టణ కూడలిలో అవగాహన కల్పించారు.అనంతరం సంఘం అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతె మాట్లాడారు.
బాలలు, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. అందుకే బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనను ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యతగా గుర్తించాలన్నారు..వ్యవసాయ సంస్కరణలు, ఉపాధి కల్పన పథకాలు, పేదల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించటం, అవ్యవస్థీకృత రంగాలను ప్రోత్సహించటం, సహకార సంఘాల ఏర్పాటు, సాంఘిక భద్రతా పథకాల రూపకల్పన వంటి చర్యలు పరోక్షంగా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఉపయోగపడతాయన్నారు. అందువల్ల ప్రభుత్వం వీటిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. బాలలను కార్మికులుగా మార్చే హక్కు ఎవరికీ లేదని, బాలలను కార్మికులుగా మార్చిన వారిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, వారి సంకెళ్ళను తెంచే బాధ్యత మనందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకుడు, సైకాలజిస్ట్ డా. అంబాల సమ్మయ్య, సభ్యులు రాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.