మహనీయుల ఆశయాలను కాపాడుకుందాం..రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
-పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మహనీయుల ఆశయాలను కాపాడుకోవడంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ అభియాన్, కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు మాట్లాడారు. భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని, గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బిజెపి పాలకులు రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ..రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ..అప్రజాస్వామ్య పాలన సాగిస్తున్నారని, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ..గౌరవిస్తూ..పాలన చేయాల్సిన పాలకులు..నేడు తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారన్నారు. భారతదేశం మన కుటుంబమని, మనం అనే భావనే మన జాతీయత అని, జాతీయ భావనతో దృఢమైన సమాజాన్ని నిర్మించి, రాజ్యాంగం చూపిన మార్గంలో పయనిద్దామన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను, మన రాజ్యాంగాన్ని అవమానించే బిజెపి దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవమానించేలా పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై-బాపు, జై-భీమ్, జై-సంవిధాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. జాతి ఐక్యత ముఖ్యమని మహాత్మా గాంధీ పేర్కొన్న మాటలను గుర్తు చేస్తూ..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించుకుందామన్నారు. మహాత్మ గాంధీ చూపిన బాటలో ముందుకు సాగాలని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ..మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలన్నారు.