Reels Mania in Bhadrakali Temple
భక్తి తక్కువ.., రీల్స్ ఎక్కువ..?
భద్రకాళి దేవాలయంలో రీల్స్ చేస్తున్న యువతి, యువకులు.
భక్తి కంటే రీల్స్ మోజు.. భద్రకాళి దేవాలయంలో సోషల్మీడియా వేడి?
“ఓ ధర్మకర్త” ఎవరికి పడితే వారికి “వీఐపీ దర్శనాలు”?
నేటిధాత్రి, వరంగల్.
భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో భక్తి తగ్గి రీల్స్ మోజు పెరిగిపోతుంది. అమ్మవారి దర్శనానికన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం యువత, యువకులు పోటీ పడుతున్నారు. అమ్మవారికి మొక్కులు మొక్కి లోపల ఒక ఫోటో, బయటకు వచ్చి ఫ్యామిలీతో, స్నేహితులతో గ్రూపు ఫోటోలు దిగడం, వీడియోలు తీయడం సాధారణమైపోయినా, కొందరు గుడిలోపలే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రీల్స్ చిత్రీకరించడం భక్తులకు ఇబ్బందిగా మారింది. మధ్యలో కాగితాలపై ప్రదక్షిణల సంఖ్య రాసుకుని చూపడం, ఫోన్ కెమెరాల ముందు హావభావాలతో ప్రదర్శనలు చేయడం వల్ల ఆలయంలో భక్తి వాతావరణం దెబ్బతింటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రోజూ దర్శనానికి వస్తుండగా, చాలామంది యువత సోషల్మీడియా ప్రలోభానికి లొంగి “పుణ్యక్షేత్రాలను కూడా ఫ్యాషన్ వేదికలుగా” మార్చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక చిన్న చిన్న సినీ ప్రముఖులు, యు ట్యూబర్లు లేదా స్థానిక నాయకులు గుడికి వచ్చినప్పుడు వీఐపీ తరహాలో గుంపులు గుంపులుగా 20 నుండి 30 మంది ప్రవేశించడం, ఓ “తోపు ఆలయ ధర్మకర్త” ఒకరూ వారికి వరుసగా కండువాలు కప్పడం వంటి చర్యలు భక్తుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తనతో గౌరవం తగ్గిపోతుందని, ధర్మకర్తల బాధ్యత భక్తుల పక్షాన ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకుని, గుడి క్రమశిక్షణను కాపాడేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.
