Legal Services Camp for Senior Citizens in Warangal
వయో వృద్ధుల సంక్షేమం కొరకు న్యాయ సేవలు:-
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి.బి నిర్మలా గీతాంబ:-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
శనివారం రోజు వరంగల్ కలెక్టరేట్ ఆఫీస్, డి.ఆర్.వో. కార్యాలయంలో వృద్ధుల సంక్షేమం కొరకు న్యాయ సేవల శిబిరం ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ మరియు వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ “తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంరక్షణ – మన సామాజిక మరియు చట్టపరమైన బాధ్యత అని తెలిపారు.ఈ ఉచిత న్యాయ సేవా శిబిరం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది మన ఇంట్లో ఉన్న వృద్ధులకు మనం ఇచ్చే భరోసా. వృద్ధు లలో ఆత్మగౌరవం తగ్గ కూడదు. నేటి సమాజంలో మారుతున్న జీవనశైలి వల్ల చాలామంది వృద్ధులు ఒంటరితనాన్ని, నిర్లక్ష్యాన్ని
ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 2007లో “తల్లిదండ్రులు మరియు వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం” తీసుకువచ్చింది అని తెలిపారు. వృద్ధులు పోషణ పొందే హక్కు, ఆస్తి రక్షణ, తక్షణ పరిష్కారం మొదలగు హక్కులు కలిగి ఉన్నారని వివరించారు. అదేవిధంగా ఏ వృద్ధుడూ ఆకలితోనో, ఆత్మాభిమానం దెబ్బతిని రోడ్డు మీద నిలబడ కూడదన్నదే మా న్యాయ సేవాధికారాల సంకల్పం అని తెలిపారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే నిర్భయంగా ఈ న్యాయ సేవా శిబిరంను సంప్రదించి, ఉచిత న్యాయ సలహాలు పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్.డి.ఓ. టి.సుమ, డి.ఏ.ఓ.ఫణి కుమార్, న్యాయవాది యస్.కుమార్, పారా లీగల్ వాలంటీర్ ఆలేటి.డార్కస్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, వరంగల్ అధ్యక్షులు మల్లారెడ్డి మరియు వయోవృద్ధులు పాల్గొన్నారు
