Legal Notice on ₹4.5 Crore Hospital Scam
ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగున్నర కోట్లకుపైగా అవినీతి కుంభకోణంపై రాష్ట్ర, జిల్లా అధికారులకు లీగల్ నోటీసులు- ఏఐఎఫ్బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నాలుగున్నర కోట్ల అవినీతి కుంభకోణంపై ఎలాంటి చర్యలు తీసుకోనందున, అవినీతి అధికారులైన డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ నవీన అదే స్థానంలో కొనసాగించడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ హెూంశాఖ, హెల్త్ మెడికల్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీ, తెలంగాణ స్టేట్ విజిలెన్స్ కమిషన్, కరీంనగర్ జిల్లా కలెక్టర్, సీపీ, డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరోకు లీగల్ నోటీస్ పంపించినట్లు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎఐఎఫ్బి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అల్ ఇండియా యూత్ రాష్ట్ర కన్వినర్ రావుల ఆదిత్య, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె.బద్రినేత, ప్రశాంత్, సుధామ్ తో కలిసి బండారి శేఖర్ మాట్లాడుతూ కరీంనగర్ జనరల్ హాస్పిటల్ లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెందిన నాలుగున్నర కోట్ల రూపాయల దుర్వినియోగం చేయడం వంటి కుంభకోణంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ అజయ్ ప్రసాద్, డాక్టర్ నవీన, డాక్టర్ మొహమ్మద్ అలీమ్, డాక్టర్ రత్నమాల, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జ్యోతిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అప్పటి విచారణ అధికారి డాక్టర్ కె.లలితాదేవి 08-01-2024న కరీంనగర్లోని అప్పటి డీఎంహెచ్వో యొక్క విచారణ నివేదిక కాపీ జిల్లా కలెక్టర్ కి ఇచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న అధికారులపై చట్టపరమైన మరియు క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక బాధ్యత కలిగిన పౌరుడిగ వీరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని లీగల్ నోటీసు పంపించడం జరిగిందన్నారు. అవినీతి అధికారులు ఎటువంటి బిల్లులు సమర్పించకుండా ఒకరితో ఒకరు కుమ్మక్కయి గొలుసు చర్యలో పాల్గొన్నట్లు తేలిందని, 2021 నుండి 2024 వరకు కరీంనగర్ జిల్లా జనరల్ హాస్పిటల్లోని అప్పటి సూపరింటెండెంట్, ఇతర వైద్యులు హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ (హెచ్డిఎస్)నిధులు, కాయకల్ప్, టివివిపి, టిఎస్ఎమ్ఎస్ఐడిసి, ఆసుపత్రి నిర్వహణ కోసం డీజిల్ మరియు పెట్రోల్ ఖర్చులు వంటి అనేక విభాగాల కింద నాలుగున్నర కోట్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డ డాక్టర్ కృష్ణ ప్రసాద్ (అప్పటి సూపరింటెండెంట్, జిల్లా జనరల్ హాస్పిటల్, కరీంనగర్ ఇప్పుడు సూపరింటెండెంట్, టీవీవీపీ కరీంనగర్) మరియు డాక్టర్ నవీన (ప్రస్తుతం ఆర్ఎంవో, జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ మొహమ్మద్ అలీమ్, డాక్టర్ రత్నమాల, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జ్యోతిలతో పాటు బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 316, 317, 318 మరియు అవినీతి నిరోధక చట్టం యొక్క యూ/జెడ్ సెక్షన్ 13(1)(సి) & (డి) నిబంధనల కింద ప్రాసిక్యూట్ చేయబడతారని, పబ్లిక్ సర్వెంట్స్ ఎంక్వైరీ యాక్ట్, 1950 కింద వారి ఆస్తుల అసమానతపై విచారణ మరియు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా ఈలీగల్ నోటీస్ కి సమాధానం ఇవ్వని యెడల న్యాయస్థానంలో చట్టపరంగా పోరాడతానని వారు తెలిపారు.
