రామకృష్ణాపూర్,ఫిబ్రవరి 07 నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి రాములు ను జిల్లా కలెక్టర్ ప్రిసిడింగ్ ఆఫీసర్ గా నియమించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డుల కౌన్సిల్ సభ్యులకు గాను 13 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సమావేశానికి కావలసిన కోరం 15 మంది సభ్యులు లేనందున చైర్పర్సన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రిసీడింగ్ అధికారి అధికారికంగా తెలియజేశారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో క్యాతనపల్లి మునిసిపాలిటీ పాలకవర్గం కాంగ్రెస్ వశమైంది. క్యాంపులో ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్ తో పాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసం మీటింగ్ కు హాజరు కాలేదు. ఈ సందర్భంగా క్యాంప్ లో ఉన్న చైర్ పర్సన్ జంగం కళ మాట్లాడుతూ… చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో తాము పాలకవర్గాన్ని దక్కించుకున్నామని అన్నారు. కాంగ్రెస్ విజయం పట్ల కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు హర్షం ప్రకటిస్తూ క్యాతనపల్లి మునిసిపాలిటీ కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అవిశ్వాస తీర్మాణ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందమర్రి సిఐ మహేందర్ రెడ్డి నేతృత్వంలో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై రాజశేఖర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవిశ్వాస తీర్మాణ మీటింగ్లో మందమర్రి తాసిల్దార్ చంద్రశేఖర్, పుర కమిషనర్ వెంకటనారాయణ, మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.