పరకాలలో పర్యటించిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్
పరకాల నేటిధాత్రి(టౌన్)
ఈ నెల 9న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పరకాల పట్టణంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం ఉదయం పర్యటించారు. మొదటగా వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. మంత్రి పర్యటనలో భాగంగా రూ.114 కోట్ల 65 లక్షలతో మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు వారు తెలిపారు. ఆయా శాఖల అధికారులకు చేయాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సమావేశ అనంతరం వ్యవసాయ మార్కెట్ లో హెలిప్యాడ్,డిగ్రీ కళాశాల భవనం నిర్మాణ స్థలాన్ని, తహసీల్దార్, ఆర్డీఓ నూతన భవనాలను, సమావేశం స్థలాన్ని,నూతన మున్సిపాలిటీ భవనాన్ని సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో పనిచేసి మంత్రి కేటీఆర్ పర్యటను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే,కలెక్టర్ లు తెలిపారు.ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి పర్యటన వివరాలు తెలియచేస్తూ మధ్యాహ్నం 1 గంటకి మంత్రి కెటిఆర్ ఛాపర్ ద్వారా పరకాల వ్యవసాయ మార్కెట్ చేరుకుంటారు,అక్కడి నుండి నేరుగా నూతనంగా మున్సిపల్ కార్యాలయం చేరుకుంటారు. అక్కడే రూ.114 కోట్ల 65 లక్షలతో మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన ప్రారంభోత్సవాలు, బి.సి., మైనార్టీ,క్రిస్టియన్ మైనార్టీ, దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ , గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందచేయనున్నారు. అనంతరం పశుల సంతలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభకు బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అదనపు కలెక్టర్ మహేందర్ జి, ఎస్సి కార్పొరేషన్ ఈడీ మాధవీలత, బిసి కార్పొరేషన్ ఈడీ రాంరెడ్డి, కమిషనర్ శేషాoజనేయులు, ఆర్డీఓ శ్రీనివాస్,ఆర్ & బి, పంచాయతీరాజ్, ఇర్రిగేషన్,మున్సిపల్, ఆరోగ్య పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.