
MP Maddila Gurumurthy..
తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్‌తో కీలక ప్రతిపాదనలు..
ఎంపీ మద్దిల గురుమూర్తి..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 04:
ముంబయిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌ను తిరుపతి పార్లమెంటు సభ్యులు డా. మద్దిల గురుమూర్తి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి అభివృద్ధికి సహాయపడే ముఖ్య అంశాలపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు.
*తిరుపతిలో టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బిపిఓ ఏర్పాటుకు విజ్ఞప్తి..
తిరుపతి జాతీయ స్థాయి విద్యా కేంద్రంగా, ఐజర్, ఐఐటి, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీలతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఈ ప్రాంత యువతకు అత్యాధునిక రంగాలు అయినటువంటి డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, సేవా రంగాలలో శిక్షణ కల్పించే టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమని తెలిపారు.అదే విధంగా బిపిఓ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.
*కలంకారి ప్రాచీన కళకు టాటా ఫ్యాషన్ ద్వారా ప్రోత్సాహం ఇవ్వండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాచీన కళ అయిన కలంకారీ నేటి ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తగిన గుర్తింపు పొందడం లేదని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కళను పునరుజ్జీవింపజేసేందుకు టాటా క్లిక్, వెస్ట్‌సైడ్ వంటి టాటా ఫ్యాషన్ సంస్థల ద్వారా కలంకారీ ఉత్పత్తులను ఆధునిక డిజైన్లతో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కలంకారీ కళాకారులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయని, అలాగే భారతీయ సాంస్కృతిక సంపదను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందేలా చేసే అవకాశం ఉంటుందన్నారు.
తిరుపతి నుండి కువైట్, గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించండి..
రాయలసీమకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, అయినా తిరుపతి నుండి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవని ఎంపీ గుర్తు చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి నుండి కువైట్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు.ఇది స్థానికుల ప్రయాణ దూరాన్ని తగ్గించడమే కాకుండా, భక్తుల రాకపోకలు, వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ మూడు ప్రతిపాదనలు తిరుపతి ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ఎంపీ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కి వివరించగా సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు.