
: Devotees Rush to Ketaki Sangameshwara Temple
భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం
భక్తిశ్రద్ధలతో శ్రావణమాస పూజలు.. సర్వ దర్శనానికి 3 గంటల సమయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం శ్రావణ మాస సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
స్వామి వారికి ప్రత్యేక పూజలు..
సోమవారం శ్రావణమాస సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు,
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ శేఖర్ పటేల్ , ధర్మ కర్త కంతనం మల్లయ్య స్వామి కార్యనిర్వాహణ అధికారి రుద్రాయ స్వామి, తగిన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.