ఆలయల్లో డ్రెస్‌కోడ్‌పై కొలిక్కిరాని వివాదం
సమర్థకులు…వ్యతిరేకులు..ఎవరి రాజకీయాలు వారివే
సీపీఎం ఓటుబ్యాంకులోకి ఎంట్రీ ఇస్తున్న భాజపా
హిందూ ఓట్ల ఐక్యతపై బీజేపీ దృష్టి
కుల, మత రాజకీయాలపై ఇతర పార్టీల ఆసక్తి
మూఢత్వం నుంచి సామాజిక ప్రగతివైపు కేరళ ప్రస్థానం
హైదరాబాద్,నేటిధాత్రి:
కేరళలోని హిందూ దేవాలయాల్లోకి వెళ్లినప్పుడు శరీరం పైభాగంలోని దుస్తులు విప్పి స్వామి ద ర్శనం చేసుకోవాలన్న నిబంధన ఇప్పటికీ అమలవుతోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సహజం. గత డిసెంబర్ 31న కేరళలోని నారాయణ గురు స్థాపించిన ప్రముఖ శివగిరి మఠానికి చెందిన సచ్చిదానందస్వామి ఆలయంలో స్వామి ద ర్శనానికి వెళ్లే సమయంలో శరీర పైభాగంలో ధరించిన వస్త్రాలను తొలగించాల్సిన అవసరం లేదని చెప్పడంతో వివాదం చెలరేగింది. ఇంకా ఆయన చెప్పిందేమంటే నిరాకార, నిర్గుణుడుడైన భగవానుడిని చేరేందుకు భక్తుల కు దేవాలయాలు ఉపకరణాలు మాత్రమే. ఇందుకోసం శరీర పైభాగంలోని వస్త్రాలను తొలగించాల్సిన అవసరమేముంది? అందువల్ల ఎటువంటి ప్రయోజ నం లేదు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడి మనసు దేవుడు/దేవతపై లగ్నం కావాలి. ఇది ముఖ్యం. బాహ్య వేషధారణకు దీనికి సంబంధం లేదు, అని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే వుంది కానీ, దేవాలయంలోకి ప్రవేశించేవారు జంధ్యం వేసుకున్నారా లేదా పరిశీలించేందుకు తద్వారా కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశించేందుకు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారని అనడం వివాదం సృష్టించింది. కొన్ని దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజారులు కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించాన్ని కూడా ఆయన వేలెత్తి చూపారు. నిజానికి డ్రెస్ కోడ్ అవసరంలేదు అని ఆయన చెప్పడం వరకు సమంజసమే. ఎందుకంటే దైవదర్శనం మనసు కు సంబంధించింది. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఆలయ ప్రవేశం కలిగించేందుకు ఈసం ప్రదాయం పాటిస్తున్నారనడంలో మాత్రం అర్థంలేదు. ఎందుకంటే ఆలయ ప్రవేశానికి అందరూ అర్హులే. ఎవరూ ఎవరినీ అడ్డుకోవడంలేదు. కులాల ప్రసక్తి తెచ్చి రచ్చ చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. సామాజిక అశాంతి తప్ప. 92వ శివగిరి మఠం వార్షిక తీర్థయాత్ర కార్యక్రమం ప్రారంభ కార్యక్రమంలో పాల్గన్నా ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సచ్చిదానందస్వామి వ్యాఖ్యలను సమర్థించారు. ఆయన నారాయణ గురును సనాతనధర్మం నుంచి వేరుచేయడానికి య త్నించారనే చెప్పాలి. అయితే స్పందించే సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. డ్రెస్‌కోడ్ అవసరంలేదని సచ్చిదానందస్వామి చెబుతున్న అంశం నిజమే కానీ, సర్వసమ్మతితో మాత్రమే ఇది జరగాలన్నారు.ఎందుకంటే గతంలో శబరిమలలో మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో తలకు బప్పికట్టిన సంగతి ఆయనకు బాగానే గుర్తుంది.
ముదిరిన వివాదం
ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ పి.ఎస్. ప్రశాంత్ కూడా ‘సర్వసమ్మతి’ అభిప్రాయాన్ని సమర్థించారు. చరిత్రకారుడు ఎం.జి. శశిభూషణ్ అభిప్రాయం ప్రకారం, ప్రజలు పవిత్రమైన దేవాలయాలను టూరిస్ట్ స్పాట్స్‌గా పరిగణించకుండా వుండేందుకు కూడా ఈ నిబంధనలను వి ధించి వుండవచ్చునని అభిప్రాయపడ్డారు. 1970 ప్రాంతంలో అప్పటి కేరళ ప్రభుత్వం ఈ డ్రెస్‌కోడ్ నిబంధనలను తొలగించడానికి ప్రయత్నించిన సంగతిని కూడా ఆయన గుర్తుచేశారు. ఇది లా వుండగా నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్) సెక్రటరీ జి. సుకుమారన్ నాయర్ ముఖ్య మంత్రి పినరయి విజయన్, సచ్చిదానంద స్వామిని సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిరచడంతోవివాదం ముదిరింది. ఆలయ సంప్రదాయాలను మార్చడానికి ఎవరికీ అధికారంలేదు, ప్రభుత్వానికి కూడా! ఆలయ సంప్రదాయాలను ప్రశ్నించే అధికారం సచ్చిదానందస్వామికి ఎవరిచ్చారని ఆయన విరుచుకుపడ్డారు. ప్రతి ఆలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. అందువల్ల డ్రెస్ కోడ్ పాటించడం తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.
శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేషన్, ఎన్‌ఎస్‌ఎస్ కార్యదర్శి సుకుమారన్‌పై విమర్శల దాడికి దిగడంతో వివాదం మరింత ముదిరింది. ఇటువంటి సమస్యలు హిందువులను విడదీయలేవని ఆయన అన్నారు. అయితే యోగక్షేమ సభ అధ్యక్షుడు అఖీరామన్ కళాదాసన్ భట్టత్తిరిప్పాడ్ మాత్రం కొంత సంయమనంగా మాట్లాడటం గమ నార్హం. అనవసరమైన పరిమితులు, నిబంధనలు ఎత్తేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అయితే బ్రాహ్మణులను గుర్తించడానికే ఈ డ్రెస్‌కోడ్ తీసుకొచ్చారన్న వాదనను మాత్రం ఆయన ఖండిరచారు. ‘‘ఒక్కొక్క దేవాలయానికి ఒక్కో సంప్రదాయం వుంటుంది. ఉదాహరణకు శబరిమల దేవాలయనికి డ్రెస్‌కోడ్ నిబంధనలేం లేవు. కానీ 10 నుంచి 50ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ లకు ఆలయంలో ప్రవేశం నిషిద్ధం. మార్పులకు మేం వ్యతిరేకం కాదు. కానీ ప్రతిదానికీ బ్రాహ్మ ణులు ఆధిపత్యం అనడం ఎంతమాత్రం సమంజసం కాదు’’ అని స్పష్టం చేశారు.
విజయన్ మద్దతు వెనుక రాజకీయం
అతిపెద్ద తీర్థయాత్రా కేంద్రమైన శివగిరి మఠానికి విజయన్ మద్దతుగా నిలవడం వెనుక ఒక రాజకీయ కారణం వుంది. ఈ మఠం హిందువుల్లోని ఎరaవా వర్గం శివగిరి మఠాన్ని అత్యంత పవిత్ర మైనదిగా భావిస్తారు. పెద్దంసంఖ్యలో ఈ వర్గానికి చెందిన ప్రజలు ఈ మఠాన్ని సందర్శి స్తుంటారు కూడా. ఓబీసీలైన వీరు సీపీఎంకు బలమైన మద్దతుదార్లు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకోవడానికి యత్నిస్తుండటం విజయన్‌కు ఎంతమా త్రం మింగుడుపడటంలేదు. ముఖ్యంగా భారత ధర్మ జనసేన (బీడీజేఎస్), శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం (ఎస్‌ఎన్‌డీపీ) అనే రెండు సంస్థలు భారతీయ జనతాపార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం సీపీఎంకు ఓటుబ్యాంకుగా వున్న ఎరaవా వర్గం ప్రజల్లో బీజేపీ పలు కుబడిని పెంచడానికి ఇవి తీవ్రంగా కృషిచేస్తున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎంకు గట్టి మద్దతుగా నిలిచిన ఇక్కడి ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి గణనీయంగా ఓట్లు సంపాదించడం వెనుక ఈ రెండు సంస్థల కృషి ఎంతో వుంది. లోకనీతి, సీడీఎస్ సర్వే ప్రకారం ఎరaవా కులాల్లో బీజేపీకి ఏకంగా 32% ఓట్లు లభించాయి. ఇది గతంతో పోలిస్తే 11% ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఎన్‌డీపీని పూర్తిగా కాషాయీకరిం చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదంటూ సీపీఎం విరుచుకుపడుతోంది.
శివగిరి మఠానికి ఎందుకంత ప్రాధాన్యం?
కేరళకు చెందిన నారాయణ గురు గొప్ప సంఘసంస్కర్త. ఆయన మతసామరస్యంతో పాటు అందికీ సమాన విద్య, అన్ని వర్గాల మధ్య సమానత్వం అవసరమంటూ ఉద్యమాలు చేశారు. శివగిరి మఠాన్ని 1903లో ఆయన స్థాపించారు. ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు’ అనేది ఈయన ప్రవచించిన సిద్ధాంతం. ముఖ్యంగా బాగా వెనుకబడిన ఎరaవా కులం వారి అభ్యున్నతికోసం అహర్నిశలు పాటుపడ్డారు. ప్రజల్లో ఉన్నత విలువలను పెంపొందించే ప్రక్రియలో భాగంగా ఏటా ఈ ‘తీర్థయాత్ర’ కార్యక్రమాన్ని మఠం నిర్వహిస్తుంది. నిజానికి ఎరaవా వర్గం వారు కేరళ జనాభాలో 23% వరకు వున్నారు. దీనివల్ల సీపీఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వీరిని గొప్ప ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శివగిరి మఠంతో మంచి సంబంధాలను కొన సాగించడం ద్వారా ఈ వర్గం ప్రజల్లో పలుకుబడి పెంచుకోవాలని తంటాలు పడుతున్నాయి. బీజేపీ హిందువుల ఓట్లు చీలడానికి ఎంతమాత్రం ఇష్టపడదు. ఈ నేపథ్యంలో నారాయణ గురు సంప్రదాయానికి పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా ఎరaవా వర్గాల్లో పలుకుబడి పెంచుకోవ డానికి ప్రయత్నిస్తోంది. అయితే శివగిరి మఠం ఇప్పటివరకు ఏపార్టీకి మద్దతు ఇవ్వకుండా తట స్థ వైఖరి అవలంబిస్తోంది. ఫలితంగా అన్ని పార్టీలు ఈ మఠాన్ని తమకు వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. శివగిరి మఠం ముఖ్యంగా ఆలయల్లో అనుసరిస్తున్న డ్రెస్‌కోడ్‌ను వ్యతిరేకిస్తుంది. ఇందులో భాగంగా జనవరి 17న ట్రావన్‌కూర్ దేవస్థానం బోర్డువరకు మఠం సన్యాసులు ఒక ప్రదర్శన కూడా నిర్వహించడం గమనార్హం.
మూఢత్వం నుంచి ప్రగతి పథం వైపునకు….
నిజానికి కేరళలో కులవివక్షకు వ్యతిరేకంగా తొలి ఉద్యమం 1813లో చోటుచేసుకుంది. నాటి ట్రావన్‌కూర్ సంస్థానంలోని వెనుకబడిన వర్గాలైన నాడార్లు ఈ ఉద్యమాన్ని నిర్వహించారు. అప్పటివరకు ఈ కులాలకు చెందిన మహిళల వక్షాలను వస్త్రంతో కప్పుకోవడానికి అనుమతి వుండేది కాదు. మారు మరక్కల్ సమారం పేరుతో జరిగిన ఈ ఉద్యమం 50 సంవత్సరాల పాటు సాగింది. నాటి ట్రావన్‌కూర్ ప్రభుత్వం, అత్యంత శక్తివంతమైన నాయర్‌లు ఈ ఉద్యమాన్ని అణచివేశారు. అయితే చివరకు ప్రభుత్వం నాడార్ మహిళలకు తమ పైభాగాలను వస్త్రంతో కప్పుకునే హక్కును సమర్థించిడంతో వివాదం సమసింది. తర్వాత 1859లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ ఛార్లెస్ ట్రెవెలియన్ ఒత్తిడితో నాడార్లలో అత్యధికులు క్రైస్తవంలోకి మారిపోయారు. అప్పట్లో కేరళలోని ఉన్నత కులాలకు చెందిన మహిళలు కూడా ఆలయంలోకి వెళ్లాలంటే తమ పైభాగంలోని ఆచ్ఛాదనను తప్పనిసరిగా తొలగించాల్సిందే. ఇదిలావుండగా 1936కు ముందు కేరళ దేవాలయాల్లోకి వెనుకబడిన వర్గాలవారు ప్రవేశించడానికి అనుమతి వుండేది కాదు. అయితే 1936లో మహాత్మాగాంధీ, నారాయణగురులు వైకోమ్‌లో సత్యాగ్రహం చేశారు. కేరళలో అత్యధిక శాతం హిందువులు ఇతర మతాల్లోకి మారిపోవడానికి ప్రధాన కారణం ఈ మూర్ఖపు ఆచార వ్యవహారలేనని చెప్పాలి.దీంతో అప్పటి ట్రావన్‌కూర్ సంస్థానాధిపతి ఈ నిషేధాన్ని ఎత్తేశారు. స్వాతంత్య్రం వచ్చిన 50 సంవత్సరాలు దాటిన తర్వాత దేవాలయాల్లో బ్రాహ్మణేతర పూజార్ల నియామకం కూడా జరుగుతోంది. 2018లో ప్రస్తుత విజయన్ ప్రభుత్వం ట్రావన్‌కూర్ దేవస్థాన బోర్డులో దళితులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. ఈ దేవస్థానం కింద 1200 దేవాల యాలున్నాయి.