‘‘సారు’’…’’హరీష్‌కు పగ్గాలిచ్చి చూడు’’!

https://epaper.netidhatri.com/view/292/netidhathri-e-paper-13th-june-2024%09/3

`స్టీరింగ్‌ అప్పగించకపోతే మరింత కుదేలు.

`బీఆర్‌ఎస్‌లో హరీష్‌ను మించిన లీడర్‌ లేడు.

`ప్రజలను కదిలించే శక్తి ఆయనకు తప్ప మరెవరికీ లేదు.

`మాస్‌ లీడర్‌ ముద్ర మరొకరికి రాదు.

`క్షేత్ర స్థాయిలో బలపడాలంటే హరీషే కరక్టు.

`నాయకులు, కార్యకర్తల మనసు తెలుసుకోవడం హరీష్‌కు తెలుసు.

`జనంలోకి చొచ్చుకుపోగలడు.

`ఎంతటి పోరాటాలైనా చేయగలడు.

`ఉద్యమ మూలాలు హరీష్‌ కే ఎక్కువ.

`పాత తరాన్ని కలుపుకు రాగలడు.

`కొత్త తరంలో అవగాహన పెంచగలడు.

`ఉద్యమ కాలం రోజులు తేగలడు.

`అప్పట్లో తెలంగాణ ఎట్లా వుంది చెప్పగలడు.

`బీఆర్‌ఎస్‌ పాలనలో ఎలా మారిందో చూపగలడు.

`అందరినీ కలుపుకుపోగలడు.

`పాత, కొత్త కలయికను ఏకతాటిపైకి తేగలడు.

`సమిష్టి నిర్ణయాలు చేయగలడు.

`పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టగలడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటును చేయాలి. ఇది ఇటీవల కాలంలో బలంగా పార్టీలో బలంగా వినిపిస్తున్న మాట. ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. హరీష్‌రావును వర్కింగ్‌ ప్రెసిడెంటును చేస్తే తప్ప పార్టీకి మనుగడ లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. నిజానికి తెరాస నిర్మాణంలో మూలం కేసిఆరే అయినా, కర్త, కర్మ,క్రియ హరీష్‌రావే అన్నది అందరికీ తెలుసు. కేటిఆర్‌, కవితలు ఉద్యమ శ్రీకారంలో లేరు. పార్టీ నిర్మాణ సమయంలో అమెరికాల వున్నారు. ఊరురా హరీష్‌రావు గులాబీ జెండా ఎగురవేసిన నాడు కేటిఆర్‌, కవితలు అమెరికాలో వున్నారు. అందువల్ల కాలంతోపాటు మనమూ కొన్ని సార్లు మారాలి. రాజకీయాల్లో వున్నవారు ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి. నిజానికి నాయకుడి వయసుకు, పరుగుకు సంబంధం వుండకూడదు. అందుకు చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ సాక్ష్యాలుగా చెప్పొచ్చు. బిఆర్‌ఎస్‌ అధినేత విషయంలో ఆ మాట చెప్పలేం. ఎందుకంటే ఆయన పరిగెత్తించడం తప్ప పరుగెత్తడం తెలియదు. ఈ వయసులోనే కాదు, ఏ వయసులోనైనా రాజకీయ పరుగుకు సై అనలేడు. అందువల్ల మనం పరుగెత్తలేనప్పుడు పరుగెత్తేవారిని ప్రోత్సహించాలి. ఆ విజయంలో మన గెలుపును చూసుకోవాలి. కాలానికి ఎదురీదే వారిని ప్రోత్సహించాలి. అలాంటి వారిని గుర్తించాలి. వారికి అవకాశం ఇవ్వాలి. రాజకీయ పార్టీలలో ఎవరైతే పార్టీ భవిష్యత్‌ నిర్మాతగా వుంటారో వారిని ఏరి కోరి ఎంచుకోవాలి. భవిష్యత్‌ పునాదులు బలంగా ఎవరు కాపాడుతారో వారిని ఎంపిక చేసుకోవాలి. మనమంటే నమ్మకం వుండేవారిని గుర్తించాలి. మన నమ్మకం పెంచేవారికి ప్రాదాన్యతనివ్వాలి. నిన్ను నవ్వు గొప్పగా ఆవిష్కరించుకోవాలంటే, నిన్ను ప్రేమించేవారిని పెంచుకోవాలి. వారి చేత గౌరవింపడాలి. అలాంటి నాయకుడు బిఆర్‌ఎస్‌లో హరీష్‌రావు వున్నాడు. అలాగని కేటిఆర్‌, కవితలు లేరా? అన్న ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు. అయితే వారసులు అన్ని వేళలా ఉపయోగపడకపోవచ్చు. పైగా బిఆర్‌ఎస్‌ లాంటి ఉద్యమ పార్టీకి అసలే పనికి రాకపోవచ్చు. ఇక్కడ కేటిఆర్‌. కవితలు పోరాట యోధులు కాదని కాదు. కాని వారికన్నా ముందునుంచి వున్నవారి పర్యవేక్షణ వుంటే పార్టీకి మరింత బలం. బిఆర్‌ఎస్‌ బతికి బట్టకట్టాలంటే ముందు పేరు మార్చాలి. కేసిఆర్‌ జాతీయ రాజకీయాలు పగటి కలే. తెలంగాణ రాజకీయాలకే ఆయన దూరమయ్యాడు. జనం దూరం పెట్టారు. ఇక ఆయన రాజకీయాలు చేయడం అన్నది మాటలతో అయ్యేది కాదు. టివిల్లో కూర్చొని గంటలు గంటలు చెబితే ఓట్లు పడవు. ఇది పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. కేసిఆర్‌ టివిలో కనిపిస్తే లక్షల మంది చూశారు. నాలుగు గంటలు టివిలకు అతుక్కుపోయారు.

కేసిఆర్‌ బస్సుయాత్ర చేసే ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఇక మాకు తిరుగులేదు.

మళ్లీ మమ్మల్ని ఎవరూ ఓడిరచలేరు. అనుకున్నారు. కాని వచ్చిన జనం ఓట్లేయరని ఏపిలో జగన్‌ విషయంలో కూడా రుజువైంది. ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో జగన్‌ రోడ్‌షోలకు జనమే జనం..సభలకు లక్షలాది జనం తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించారు. జగన్‌ను పదకొంటు సీట్లకు పరిమితం చేశారు. ఇది ఇప్పటి రాజకీయ చిత్రం. కాదు కాదు…నిజం. జనం వచ్చారని చంకలు గుద్దుకునే రోజులు కాదు. జనం వచ్చినంత మాత్రాన ఓట్లేయరు. ఇప్పటికైనా కేసిఆర్‌ తెలుసుకోవాలి. పార్టీని ప్రక్షాళన చేయాలి. ముఖ్యంగా పార్టీ పగ్గాలు హరీష్‌రావుకు అప్పగించాలి. ఇది సగటు బిఆర్‌ఎస్‌ కార్యకర్త మనోగతం. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి అంతో ఇంతో బిఆర్‌ఎస్‌ పార్టీ గ్రామీణ యంత్రాంగం వుండేది. అందుకు తోడుగా జేఏసి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ వర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు వుండేవి. అటు పార్టీ కమిటీలు, ఇటు జేఏసి కమిటీలల్లో వున్నవాళ్లంతా బిఆర్‌ఎస్‌ నాయకులే వుండేవారు. దాంతో బిఆర్‌ఎస్‌ బలంగా వుండేది. ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌ 2014లో అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ కమిటీలన్నీ రద్దయ్యాయి. జేఏసిలో వున్న నాయకులంతా బిఆర్‌ఎస్‌ నాయకులయ్యారు. దాంతో పార్టీ బలోపేతమైనా నాయకత్వ లేమి అన్నది స్పష్టంగా కనిపించింది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు కూడా పార్టీ గురించి ఆలోచించి ఓట్లు వేయలేదు. కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతో గెలిపించారు. తర్వాత 2019లో తెలంగాణ ఆగమౌతుందన్న ఆందోళనతో మళ్లీ కేసిఆర్‌ను గెలించారు. దాంతో కేసిఆర్‌లో నేనేపార్టీ..పార్టీ అంటేనేనే అన్నంతగా అహం పెరిగిపోయింది. పార్టీ యంత్రాంగం లేకపోయినా ప్రజలు కేసిఆర్‌ను చూసే ఓట్లేస్తారన్నంత ధీమా మరీ పెరిగింది. కాకపోతే 2019 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలిచిన రోజే కేటిఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంటు చేశారు. ఆ రోజే హరీష్‌రావు లాంటి వారు ఒకింత అసహనానికి గురయ్యారు. అది తెలిసిన కేసిఆర్‌ హరీష్‌రావును పక్కన పెట్టారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేశారు. ఇలా వ్యవస్ధలన్నీంటినీ తన గుప్పిట్లో పెట్టుకొని, నాయకులందరినీ తన బానిసలుగా చూసిన చరిత్ర కేసిఆర్‌ది.

2019 తర్వాత కేసిఆర్‌ అన్నీ తానై, అంతా తానై, ప్రతి శాఖను తన గుప్పిట్లోనే పెట్టుకున్నారు.

ఇతర మంత్రులకు ప్రాదాన్యత లేకుండా చేశారు. పనిలో పనిగా సెక్రటెరియేట్‌ కూల్చేశాడు. కొత్తది కట్టే క్రమంలో మంత్రులను చెల్లాచెదరు చేశాడు. ఏ మంత్రి కార్యాయలయం ఎక్కడుందో వారికే తెలియకుండాపోయింది. మంత్రులు కూడా తమ కార్యాలయాలకు వెళ్లిచేసేదేమీ లేకుండాపోయింది. ప్రగతి భవన్‌ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప, మంత్రులు చేసిందేమీ లేదు. దాంతో అటు కేసిఆర్‌తోపాటు, మంత్రులకు,ఎమ్మెల్యేలకు ప్రజలకు దూరం పెరిగింది. వాటికి తోడు ప్రగతిభవన్‌ దాటి రాని కేసిఆర్‌కు ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే అరాచకాలు ఆయనకు చేరలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారైంది. ధరణి పేరుతో అధికారులు దందాలకు తెరలేపారు. నాయకులు తమ కన్ను పడిన భూముల కబ్జాపెట్టారు. తెలంగాణ మొత్తం ఆగం చేశారు. దాంతో ప్రజలు కేసిఆర్‌ పక్కన పెట్టారు. ఇక కేసిఆర్‌ రాజకీయాలకు పనికిరాడని ఓడిరచారు. సాక్ష్యాత్తు కేసిఆర్‌నే కామారెడ్డిలో ఓడిరచారంటే కేసిఆర్‌ నాయకత్వం మాకు వద్దని చెప్పినట్లే లెక్క. అయినా కేసిఆర్‌ పదవులు మాత్రం తన వద్దే వుంచుకున్నాడు. ఇంటి నుంచి బైటకు వెళ్లనంటాడు. కేటిఆర్‌ నోటి దూల కాస్త పార్టీకి తీరని నష్టం చేకూరుస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే కేటిఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి నుంచి తప్పించాలని అందరూ కోరుతున్నారు. ఆ పదవి వెంటనే హరీష్‌రావుకు ఇవ్వాలని డిమాండ్‌ కూడా చేస్తున్నారు. ఎందుకంటే హరీష్‌రావు మాస్‌ లీడర్‌. తెలంగాణ ఉద్యమాన్ని కేసిఆర్‌ ప్రారంభించిన నాటి నుంచి ఆయన వెంట నడిచాడు. తెలంగాణ పల్లె పల్లె తిరిగాడు. ప్రతి పల్లెలో తెలంగాణ జెండా ఎగురవేశారు. తెలంగాణ ప్రాంత సమస్యల మీద పూర్తి పట్టున్న నాయకుడు. ఎందుకంటే ఆ మధ్య విపరీతమైన వర్షాలు వచ్చి కడెంప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. దాని పరిస్దితి మీద నాడు మంత్రిగా వున్న కేటిఆర్‌ను మీడియా ప్రశ్నిస్తే కడెం ప్రాజెక్టు గురించి నాకు అవగాహన లేదన్నాడు. అంటే ఆయనకు తెలంగాణ ప్రాంతం మీద పూర్తి స్దాయి అవగాహన లేదు. అమెరికా నుంచి నేరుగా వచ్చి ఎమ్మెల్యే అయి, ఉద్యమ సమయంలో సిరిసిల్లకు పరిమితమైన నేత కేటిఆర్‌.

పదేళ్లపాటు మంత్రి పదవి నిర్వహించినా, కేటిఆర్‌కు అమెరికా టూర్లు. పారిశ్రామిక వేత్తలో మీటింగ్‌లు. తప్ప క్షేత్ర స్దాయి అద్యయనం ఆయన చేసింది.

జిల్లాల పరిధి మీద అవగాహన లేదు. ముఖ్యంగా నీటి పారుదల మీద అసలే అవగాహన లేదు. తెలంగాణ సమస్యలు ఆయనకు పెద్దగా తెలియవు. కార్యకర్తల కష్టాలు తెలియవు. బిఆర్‌ఎస్‌ నాయకులందరినీ ఆయన గుర్తుపట్టలేడు. కాని హరీష్‌రావు అలా కాదు. ఆయనకు తెలంగాణ మొత్తం తెలుసు. తెలంగాణలో ఏ జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఏ సమస్యలుంటాయో తెలుసు. ప్రజల సమస్యలు తెలుసు. ప్రజలకు ఏం కావలో ఆయనకు స్పష్టత వుంది. ప్రజలను ఎలా మెప్పించాలో తెలుసు. ఎలా ఒప్పించాలో తెలుసు. ప్రజలకు ఏం చేయాలో తెలుసు. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో కూడ తెలుసు. నిత్యం ప్రజల్లో వుండడం తెలుసు. అందుకే ఆయన మాస్‌ లీడరయ్యాడు. ఆయనను ఇప్పుడున్న పరిస్ధితుల్లో లీడర్‌ను చేస్తేనే పార్టీకి మేలు. లేకుంటే పార్టీ కుదేలు. హరీష్‌కు ప్రజల్లో వున్న క్రేజ్‌ వేరు. ఉద్యమ కారులందరినీ హరీష్‌ గుర్తుపడతాడు. ఉద్యమ కారులంతా హరీష్‌ను గౌరవిస్తారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి వున్న అనేక మంది ఉద్యమకారులు హరీష్‌కు సుపరిచతం. వాళ్లంతా మళ్లీ గులాబీ జెండా కిందికి రావాలంటే హరీష్‌ రావే కరక్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!