తనయుడిని పొగిడిన కేసీఆర్
అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్లలోనే తెలంగాణను ఎన్నో అంశాల్లో నంబర్‌వన్‌గా నిలిపామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ప్రధాని రాష్ట్రం గుజరాత్‌లోనూ 24 గంటల విద్యుత్ సరఫరా లేదని.. మన రాష్ట్రంలో 24 గంటలూ కరెంట్ ఇస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు. ధరణి పోర్టల్ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్న ఆయన.. ధరణి ఉండాలో రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కేసీఆర్. ఈ సందర్భంగా తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో వందలసార్లు తిరిగానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ తన బంధువులు, మిత్రులు చాలా మంది ఉన్నారని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని.. ఇప్పుడు అప్పర్ మానేరులో చూస్తే ఏడాదంతా నీరే ఉంటోందని హర్షం వ్యక్తం చేశారు కేసీఆర్.
గతంలో కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే ఆదరించి గెలిపించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎంతో చలించిపోయానన్నారు. పార్టీ నిధులు, చందాలు సేకరించి చేనేత కార్మికులకు సహాయం చేశామని తెలిపారు. చేనేత కార్మికులకు పని కల్పించేందుకే బతుకమ్మ చీరల పథకం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. బతుకమ్మ చీరల పంపిణీ.. కేవలం చేనేత కార్మికులను ఆదుకునేందుకేనన్నారు. అవి నచ్చకపోతే తీసుకోవద్దని.. అంతే కానీ చీరల పంపిణీని రాజకీయం చేయొద్దని కోరారు. ఇక కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయ్యాక సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని, షోలాపూర్ ఎలా ఉంటుందో… సిరిసిల్లను కూడా అలా చేయాలనేదే తమ ప్రయత్నమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.