కెసిఆర్, కేటీఆర్ లు ప్రజలకు క్షమాపణ చెప్పాలి

కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్
కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ,ఈడి విచారణ నిర్వహించాలి
కెసిఆర్, కేటీఆర్ లు కాజేసిన సొమ్మును కక్కించాలి

చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి

మందమర్రి, నేటిధాత్రి:-

రాష్ట్ర ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్, కేటీఆర్ లు తప్పు చేశామని ఒప్పుకొని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ సందర్భంగా మందమర్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ బృందం మేడిగడ్డ సందర్శన ఆశ్చర్యకరమని తెలిపారు. ఒకవైపు కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు పోతున్నారని ప్రశ్నిస్తుండగా, కేటీఆర్ మరోవైపు ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారని, ఈ సందర్శనలో ఆయన తండ్రి కెసిఆర్ ప్రాజెక్ట్ ను ఎంత కష్టపడి నిర్మించి, ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకున్నాడో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. 36వేల కోట్ల రూపాయలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాల్సి ఉండగా ప్రాజెక్టు డిజైన్ మార్చి, లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేసిఆర్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అన్యాయం చేసిందని ఆరోపించారు. వేల పుస్తకాలు చదివి, ప్రాజెక్టు నిర్మించానన్నా కేసీఆర్ లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. లక్ష కోట్లుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 940 టీఎంసీల నీటిని పంపింగ్ చేసి,17లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేవలం 168 టీఎంసీలు నీరు పంపింగ్ చేసి, 90 వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందించిందని, చాలా నీరు వృధా అయ్యిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అప్పుపై వడ్డీ మాత్రమే సుమారు 50వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం పడిందని వివరించారు. ప్రజల సొమ్మును కమిషన్ల రూపంలో కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు. తుమ్మడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును గ్రావిటీకి వ్యతిరేకంగా మేడిగడ్డ వద్ద నిర్మించి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నిర్వహించాడని విమర్శించారు. ప్రాజెక్టుతో రెండు టీఎంఎస్ నీటిని అందించలేదని, మూడో టిఎంసికి 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. మూడో టిఎంసికి అనుమతులే ఇంకా ఇవ్వలేదని ఇటీవల పర్యటించిన కేంద్ర బృందం స్పష్టం చేసిందని తెలిపారు. కాంట్రాక్టర్లను ధనికులను చేసేందుకే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మించిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ, ఈడీ విచారణ నిర్వహించాలని, ప్రతి చిన్న విషయంలో దాడులు నిర్వహించే ఈడీ ఇంత పెద్ద అవినీతి జరిగిన కాళేశ్వరంపై ఎందుకు దాడులు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ దుర్వినియోగంపై సిగ్గుపడాలని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో రైతులు నష్టపోయారని, గత ప్రభుత్వ హయాంలో ఎవరు స్పందించలేదన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించగా, మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు నీటిని ఇవ్వలేకపోయిందని, ధరణి పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అనేక రకాల పథకాల పేరుతో ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై కమిటీని ఏర్పాటు చేసి, వారు దోచుకున్న సొమ్మును వారిచే కక్కించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *