తండ్రి జ్ఞాపకార్థం శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ విరాళం.
చిట్యాల, నేటిధాత్రి :
భక్తి, శక్తి, ముక్తి మానవ జీవితంలో పరమ పద సోపానాల్లాంటివని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామ వాస్తవ్యులు కసిరెడ్డి కృష్ణారెడ్డి, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో..ఆ శివాలయాన్ని కూల్చివేసి..నూతన శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ కంకణ బద్దులయ్యారు. గ్రామస్తులనంతా ఏకం చేసి..విరాళాలు సేకరిస్తూ..శివాలయం పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి తండ్రి కీ: శే: కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి స్మారకార్థం రూ.1,50,516 రూపాయల విరాళం అందించి వారి భక్తి భావాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భక్తి భావం వలన ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి దుర్గుణాలు తొలగిపోయి, భగవత్ సాహిత్యం వలన మనిషి మనసులో ప్రశాంతత పెరిగి సద్గుణాలు కలుగుతాయని, తద్వారా గ్రామస్తులందరి మధ్యన మంచి సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం అర్చకుడు రఘునందన్, గ్రామ ప్రముఖులు సర్వ శరత్ కుమార్, అనగాని రాజయ్య, మందల రాఘవరెడ్డి, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం తదితరులు పాల్గొన్నారు.