కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి అధిక మొత్తంలో కేంద్ర నిధులు

– 15వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు

– అంగన్వాడీ టీచర్లకు ఉచితంగా ట్యాబ్స్

– కేంద్ర పథకాల నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించవద్దు

– ప్రభుత్వాసుపత్రుల్లో మందులకు నిధులు ఇస్తాం

– పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు

– మంజూరైన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, దిశ కమిటీ చైర్మన్ బండి సంజయ్ కుమార్

సిరిసిల్ల, నేటిధాత్రి:

పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్& మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్&మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కమిటీ చైర్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో నిధులు మంజూరు చేయించి పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు. 851 కోట్ల రూపాయల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో హుజురాబాద్ హుస్నాబాద్ జమ్మికుంట సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, అందుకు తగిన విధంగా సిబ్బందిని వైద్యులను నియమించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ తగ్గాయని అన్నారు.
పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్ళిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, మౌలిక సదుపాయాలు అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్ఓబి నిర్మాణం తదితర పనులన్నీ వేగవంతం చేయాలని ఆదేశించారు.

Karimnagar Collectorate

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. రానున్న నాలుగు సంవత్సరాల కాలానికి సరిపడా మందుల ఇండెంట్ తనకు సమర్పించాలని, నిధులు సమకూరుస్తానని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారి నివేదికల సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు.
ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మాట్లాడుతూ పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తన క్షేత్రస్థాయి పర్యటనలో అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని వెల్లడించారు. కస్తూరిబా పాఠశాలల్లో సిబ్బంది వేతనాలు పెంచాలని, మోడల్ స్కూల్ సిబ్బందికి ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని సూచించారు. మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. విద్య, వైద్యం తదితర రంగాల్లో కేంద్రం అనేక నిధులు వెచ్చించి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకునేలా వారికి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారుల్లో ఉందని అన్నారు.

ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version