కమ్మని కల్లు మనుసు జిల్లు!!

పొద్దుగాల ఈదుళ్ల..
మాపటీలి తాళ్లళ్ల..

సేదదీరుతున్న శ్రమజీవులు..

ఔషధ గుణాలు మెండు
తక్కువ తాగితేనే మేలు

వేములవాడ రూరల్ నేటిధాత్రి

వేములవాడ రురల్ కల్లు మండవ పరిసర ప్రాంతాల్లో జరిగే సంఘటన పై నెటి ధాత్రి ప్రత్యేక కథనం…
హలో.. ఎవరూ.. ఎల్లా గౌడు అల్లుడెనా?
నేను వేణు మామా ను !!
ఆ… మామా అంత మంచిదేనా.. ఏం సంగతీ?’ ‘ఏం లేదు అల్లుడు ! ఇయాళ ఎములడా కెళ్ళి నా సోపతిగాళ్లత్తర్రు.. పోద్దాడు కల్లు ఒక్క శెట్టుది దింపి, జెర పక్కకువెట్టు..’ ‘ఆ.. శెట్టు మీన్నే ఉన్న.. గట్లనే పెడ్తతియ్యి మామా !
జెర నీళ్లుగీళ్లు గల్పకు.. మాటవోతది!’‘నీ కంటె ఎక్కువనా మామా.. గట్లనే తీ!’పొద్దుగాల పొద్దుగాల గౌండ్లోళ్లు గట్ల తాళ్లెక్కుతన్రో లేదో, గిట్ల ఫోన్లు మోగుతన్నయి. !!!
పొద్దెక్కకముందే ఉన్న కల్లంత బుక్కయితంది. మిగిలినోళ్లకు అడుగుబొడుగే దిక్కయితంది. ఆదివారం సెలవురోజుళ్ల గ్రామాల్లో ఏ తాళ్లళ్ల చూసినా జాతర లెక్కే కనిపిస్తంది. పొద్దుగూట్లె పడ్డంకనే మండువల దగ్గర సందడి తగ్గుతంది. బయట దొరికే బ్రాందీ, విస్కీ, బీరు కన్నా ధర తక్కువ కావడం, ప్రకృతి ఒడిలో సేదదీరే అవకాశముండడంతో కల్లుకు రోజురోజూ ఆదరణ పెరుగుతంది. ఆంగ్ల మద్యం ఆరోగ్యానికీ హానికరం కావడం, కల్లులో అంతోఇంతో ఔషధ గుణాలుండడం వల్ల యువత కూడా సురాపానానికి ఓటేస్తంది.

తాటిచెట్లకూ పేర్లు..

కల్లు ప్రియులు, గీతకార్మికులు తాటిచెట్లకు చిత్ర విచిత్ర పేర్లు పెట్టి మరీ, వాటి కల్లును తాగేందుకు ఇష్టపడుతారు. ఇందులో సినిమా హీరో హీరోయిన్లు, రాజకీయనాయకులు, చేపల పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. నాటికాలపు హీరోయిన్లు జమున, సావిత్రి మొదలుకొని సిల్క్‌స్మిత, రంభ, ఊర్వశి, మేనక, సిమ్రాన్‌, సౌందర్య, రోజా, నయనతార, ఇలియానా దాకా, చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునలాంటి హీరోలతోపాటు, రాజీవ్‌గాంధీ, ఇందిరా, సోనియా, జయప్రద, కేసీఆర్‌, కేటీఆర్‌, చంద్రబాబు, ఒబామాలాంటి రాజకీయ నాయ కుల పేర్లే గాక ఊటశెలిమె, బంగారుతీగ, ఆగంకాకి, గడ్డివా ము, కైక, మోహిని, సారాసీసా, మోసగాడు లాంటి ఎన్నో పేర్లు పెడుతుంటారు. ఒకప్పుడు తాటి చెట్టుకు ఎవరైనా తాము అనుకున్న పేరు పెడితే గౌడ పెద్ద మనుషులకు పార్టీ ఇచ్చే సంప్రదాయం ఉండేది. తాటిచెట్ల పంపంకం సమయం లో చెట్టుకు పేరు పెట్టి, చెట్ల వివరాలు రాసే బుక్‌(సారుకోల)లో నమోదు చేసేవారు. ఈ విచిత్రమైన పేర్లున్న తాటికల్లుకోసం కొందరు పడిచచ్చేవారు. “అబ్బా జమున కల్లు ఏముందిరా..’ అంటూ లొట్టలేసుకుంటూ తాగేవాళ్లు.

ఎన్నో రోగాలకు దివ్య ఔషధం..

తెల్లకల్లుతో జీర్ణకోశ వ్యాధులు, మూత్ర సంబంధవ్యాధులు నయమవుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడ్డా, పచ్చకామెర్లు వచ్చినా, అమ్మవారు పోసినా తెల్లకల్లు తాగించాలని డాక్టర్లు సైతం చెబుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈతకల్లు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుందని చెబుతుంటారు. అనేక ఆయుర్వేద మందుల్లో ఈతకల్లు కలిపి తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. పోద్దాటి, పండుదాటి కల్లు బాలింతలకు ఆరోగ్యమని చెబుతారు. సహజసిద్ధంగా లభించే కల్లు
తాగిరమన్ని సలహా ఇచ్చే వారు

ఈ ప్రాంతాలు తెల్లకల్లుకు ఫేమస్‌…

వేములవాడ రూరల్ ప్రాంతంలో ఎదురుగట్ల(కొండన్న పట )ఫాజిల్ నగర్, నుకలమర్రి, కొనయపల్లి ,తెల్లకల్లుకు ఫేమస్‌. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ కల్లు తాగేందుకు
వస్తుంటారు.
కల్తీలేని కల్లు దొరుకుతుందనే నమ్మకం ఉంది. పలువురు కల్లు ప్రేమికులు పేరున్న గీత కార్మికులతో దోస్తానా చేసి, వారికి బ్రాందీ, బీర్లు తాగించి, నచ్చిన కల్లు తాగడం కనిపిస్తుంటుంది. ఆదివారాలు వచ్చాయంటే చాలు తాటి వనాలు కల్లు ప్రియులతో కళకళలాడుతుంటాయి.

కొండన్న పేట తాళ్లు చాలా ఫేమస్‌..

వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల( కొండన్న పేట )
శివారులోని తాళ్ల కల్లు చాలా ఫేమస్‌. గ్రామానికి చెందిన 50 మంది గీత కార్మికులు కల్లు తీస్తారు. గ్రామంలో 1000 – 1500 తాటి చెట్లు ఉంటాయి. ప్రస్తుత సీజన్‌లో ప్రతిరోజు వెయ్యి లీటర్లకు పైగా కల్లు తీస్తారు. గీత కార్మికులు నాణ్యమైన కల్లు విక్రయిస్తుండడంతో చుట్టుపక్కన గ్రామాల ప్రజలూ ఇక్కడ కల్లు తాగడానికి వస్తారు. పట్టణాల బాటిళ్లలో కల్లు తీసుకెళ్తారు.

మూడు కాలాలు.. నాలుగు సీజన్లు..

తాటిచెట్లలో ఆడ, మగ రకాలుంటాయి. నాప, పరుపు, పండుతాళ్లను ఆడ చెట్లుగా, పోద్దాళ్లను మగ చెట్లుగా భావిస్తారు. ఏడాది పొడువునా నాలుగు సీజన్లుగా విభజిస్తారు. ఒక్కో సీజన్‌కు ఒక్కో పేరుంటుంది. చలికాలం ఆరంభంలో నాపతాళ్ల సీజన్‌ (ఆడ చెట్లు) మొదలవుతుంది. తాటి వనంలో ఏవో కొన్ని చెట్లు మాత్రమే గెలలు వేస్తాయి. వీటి నుంచి వచ్చే కల్లు తాగితే త్వరగా నిషా ఎక్కుతుంది. ఆ తర్వాత వచ్చేది పోద్దాళ్ల (మగ చెట్ల)సీజన్‌. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు నా లుగు నెలలు పోద్దాటి కల్లు లభిస్తుంది. ఈ కల్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు, అనుభవజ్ఞులు చెబుతుంటారు. అందుకే పోద్దాళ్ల సీజన్‌ పూర్తయ్యే వరకు తాటివనాలు కిటకిటలాడుతాయి. ఆ తర్వాత ఎండాకాలం ప్రారంభమయ్యే సమయంలో పరుపుతాళ్ల సీజన్‌ వస్తుం ది. వర్షాలు పడే సమయంలో వచ్చేది పండుతాళ్ల సీజన్‌.

తాటికల్లుకు గిరాకీ ఎక్కువ..

గ్రామాల్లో తాటికల్లుకు గిరాకీ ఎక్కువ. మద్యం దుకాణాల్లో ఎన్ని రకాల బ్రాందీ, విస్కీ, బీరు అందుబాటులో ఉన్నా.. తాటిచెట్ల నుంచి సహజ సిద్ధంగా లభించే కల్లును తాగేందుకు మెజార్టీ ప్రజలు ఇష్టపడుతున్నారు. పట్టణాల నుంచి ఫోన్ల ద్వారా గౌడ కులస్తులకు ఆర్డర్లు ఇచ్చి మరీ కల్లు తాగేందుకు వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక పండుగలు, పెండ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉన్నప్పుడు, ఆదివారం, సెలవురోజుల్లో తాటివనాలు కిటకిటలాడుతున్నాయి. బర్త్‌డే పార్టీలు, ఫ్రెషర్స్‌డే రోజైతే వనంలో ఉన్న కల్లు మొత్తం తమకే పోయాలని యువత ముందుగానే డబ్బులు అడ్వాన్స్‌గా ఇవ్వడం కనిపిస్తోంది. వివిధ పట్టణాల్లో ఉన్న వారు తమ బంధుమిత్రులను తాళ్లకు వెంటబెట్టుకొని వెళ్లడం, కల్లు రుచిచూపించడం ఇటీవల కాలంలో పెరిగింది.
దీనికితోడు కుటుంబ సభ్యులంతా కలిసి కల్లు తాగడం అలవాటుగా మారింది. ఉదయాన్నే మాంసం వండుకుని, చపాతీలు చేసుకుని వనాలకు వెళ్లడం, అక్కడ కుండ చికెన్‌, బొంగుచికెన్‌ తదితర వంటకాలు చేసుకుని ఇంటిళ్లిపాదీ ఎంజాయ్‌ చేయడం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈతకల్లుకూ డిమాండ్‌ ఉంటోంది. బీరు, బ్రాందీ తాగినా సరే.. చివరన తెల్లకల్లు తాగనిదే తృప్తి చెందని వారికి గ్రామాల్లో లెక్కలేదు. చాలా మంది వృద్ధులు సాయంత్రమైతే చాలు, కల్లుబొట్టుతో గొంతు తడుపుకోనిదే నిద్రపోరు. రోజూ పొద్దున పాలు తెప్పించుకున్నట్లే ఏడాది పొడుగునా వాడిక పట్టి మరీ కల్లు తెప్పించుకుంటారు. కల్లు తాగని రోజు నిద్రకూడా పోని వారు కూడా ఎందరో ఉన్నారు.

గౌడ కులస్తులకు గౌరవం..

కల్లు పారిందంటే గ్రామాల్లో గౌడ కులస్తులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆదివారం, పండగ, సెలవు రోజుల్లో కల్లుకు గిరాకీ ఎక్కువ. చాలాచోట్ల వారం ముందు చెబితే గానీ కల్లు దొరకని పరిస్థితి. అందుకే కల్లుప్రియులు గౌడ కులస్తుల ఫోన్‌ నంబర్లు సేకరించి, ముందుగానే బుక్‌ చేస్తారు. ‘అన్నా.. నేను రేపు పొద్దుగాల కల్లుకు వస్తన్నా. గా పుట్టమీది చెట్టు కల్లు నాకే ఉంచు.’ అంటూ వరుసలు కలుపుతారు.

మితంగా తాగాలి..

కల్లు ఆరోగ్యానికి మంచిదే. కానీ మితంగా తీసుకోవాలి. అతిగా తీసుకుంటే అనారోగ్యం పాలవక తప్పదు. కల్లులోని పోషకాలు ఆర్యోగాన్ని కాపాడతాయి. గతంలో కల్లు తీతకు గీత కార్మికులు మట్టి కుండలు వాడేవారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ బాటిళ్లు వాడుతున్నారు. బాటిళ్లు వాడకుండా మట్టి కుండలనే వాడితే బాగుంటుందని
పలువురు కల్లు ప్రియులు భావిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!