https://epaper.netidhatri.com/view/290/netidhathri-e-paper-11th-june-2024%09
`రేవంత్ రెడ్డి కొలువులోకి ఎంట్రీ.
`మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం.
`ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిలో ఆయన ప్రగతి సంతకం.
`వరంగల్ రాజకీయాలను శాసించే చాణక్యం.
`ఏ పార్టీలో వున్నా ఆయనదే పెత్తనం.
`సైకిల్ పార్టీ అధికారంలో వున్నంత కాలం ఆయనదే సవారి.
`కారు పార్టీలో స్టీరింగ్ ఆయన చేతుల్లోనే.
`ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్దన్న పాత్రకు ఆమోదం.
`కాంగ్రెస్ అభివృద్ధికి కావాలి కడియం అనుభవం.
`జిల్లా అభివృద్ధికి కడియం మార్గనిర్ధేశనం అవసరం
హైదరాబాద్,నేటిధాత్రి:
అదృష్టం అన్ని వేళలా అందరికీ తోడుండదు. అప్పుడప్పుడు అందరికీ పలకరించి మాత్రమే వెళ్తుంది. కొందరికి మాత్రం ఎల్లవేళలా తోడుంటుంది. తలుపుదగ్గరే కాచుకొని వుంటుంది. అలాంటి అదృష్టం రాజకీయ నాయకులలో కొందరకే వుంటుంది. అది కడియం శ్రీహరి లాంటి వారితో ఎప్పుడూ వెంటవుంటుంది. కడియం రాజకీయాలు మొదలుపెఎదురొచ్చినా అదృష్టం నేను తోడున్నానని బాస చేసినట్లుంది. సైకిల్ మీద రాజకీయ సవారీ చేసినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఆయన కనుసన్నల్లోనే వుంది. కారెక్కిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతుల్లోకే వెళ్లిపోయింది. కారు దిగిన వెంటనే మళ్ళీ విజయం అభయమిచ్చింది. అభయహస్తం తోడుగా నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలకు పెద్ద దిక్కుగా నిలబడమని కోరుతోంది. ఎందుకంటే ఆయన అజాతశత్రువు. అందరికీ అయిన వాడు. అవతలివారెంత పెద్ద వారైనా కడియంతో కలివిడిగా వుంటారు. ఆయన కలుపుగోలుతనానికి అందరూ అభిమానులౌతారు. అదృష్టమంటే అది. పార్టీలు మారినా పదవుల స్వాగతాలు ఆగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ళపాటు మంత్రిగా ప్రజలకు సేవలందించారు. వరంగల్ జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ వరంగల్ చరిత్రలో చెరగని సంతకాలు చేస్తూనే వున్నారు. వ్యక్తిగత రాజకీయ వైరుద్యాలను తెరమీద తెచ్చి కడియంను విమర్శించిన వాళ్లంతా అక్కడే వుంటున్నారు. తన రాజకీయ చాణక్యంతో ప్రజాసేవలో కడియం ఇప్పటికీ దూసుకుపోతున్నారు. కడియం శ్రీహరి తీసుకునే రాజకీయ నిర్ణయాలలో ఇప్పుటి వరకు తప్పటడుగు పడలేదు. ఆయన వేయలేదు. వేసే అడుగు, చెప్పే మాట పొల్లుపోదు. వృధా అసలే కాదు. ఏ పార్టీలో వున్నా నిబద్దతకు నిదర్శనంగా వుంటారు. పొదుపైన మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆయనకు ఎదురొచ్చిన వాళ్లంతా సైడైపోతారు. అలవోకగా అందలం ఎక్కుతూనే వుంటారు. పదవులకు వన్నె తెస్తూనే వుంటాడు. పదవులకే కడియం అలంకారం తెస్తుంటాడు. అందుకే ఆయనను అందరూ కోరుకుంటారు. మూడు దశాబ్దాలుగా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతూనే వున్నారు. అప్పుడప్పుడు పరిస్థితులు అనుకూలించకపోయినా, కాలం నీ వెంటే వున్నానని ధైర్యం చెబుతుంది. ఆ కాలం గడచిన వెంటనే కొత్త జీవితం పలకరిస్తూనే వుంటుంది. ఒక రకంగా అదృష్టం కడియంను తరుముతూనే వుంటుంది. తనతో పాటు పరుగెత్తమని సవాలు చేస్తున్నట్లుంది. విరామం లేని ప్రజా సేవకు ఎప్పుడూ సిద్దంగా వుండమని సహరిస్తున్నట్లుంది.
స్టేషను ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరో సారి మంత్రి కాబోతున్నారా! అంటే అవుననే సమాధానం కాంగ్రెస్ వర్గాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొలువులో పాలనలో విశేష అనుభవం వున్న కడియం శ్రీహరి వుంటే మరింత మేలని నమ్మతున్నారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఆ విస్తరణలో కడియం శ్రీహరికి కచ్చితంగా బెర్త్ వుంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. గత శాసనసభ ఎన్నికలలో బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికైన కడియం శ్రీహరి పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. తన కూతురు కావ్యకు వరంగల్ పార్లమెంటు సీటు ఇప్పించుకున్నారు. కావ్యను గెలిపించుకున్నారు. కడియం శ్రీహరిని ఓ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ వరంగల్ ప్రజలు ఆదరించారు. కావ్యను రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించారు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వరకు ఆయన ఎంతటి బలమైన నాయకుడో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశంలో వున్న సమయంలో సమర్థవంతమైన మంత్రిగా మంచి గుర్తింపు పొందారు. ప్రజల మన్ననలను పొందారు. 2004 ఎన్నికలలో ఓడిరచిన స్టేషను ఘనపూర్ ప్రజలు 2006లో వచ్చిన ఉప ఎన్నికలలో మళ్ళీ గెలిపించారు. ఇలా తన రాజకీయ ప్రస్థానంలో ఓటమి క్షణాలు తక్కువ. తెలంగాణ రాజకీయాలలో సుదీర్ఘ కాలం పాటు మంత్రులుగా పని చేసిన వాళ్లు చాలా తక్కువ మంది వున్నారు. అలాంటి వారిలో కడియం శ్రీహరి ఒకరుగా వున్నారు. కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. కడియం శ్రీహరి, సిఎం రేవంత్ రెడ్డి ఒకే కాలేజ్ లో చదువుకున్నారు. తెలుగు దేశం పార్టీలో సుదీర్ఘ కాలం కలిసి పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో వున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు పెద్ద దిక్కుగా వుండాల్సిన అవసరం కూడా వచ్చింది. ఇప్పటి వరకు మంత్రి వర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదు. కడియం శ్రీహరి కులం మాదిగ కులానికి ఉప కులం కావడం గమనార్హం. దాంతో సామాజిక సమీకరణాలు కూడా భర్తీ అవుతుంది. కాంగ్రెస్ మీద వున్న అపవాదు తొలగుతుంది. కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి కొత్త వాళ్లే ఎక్కువ ఎన్నికయ్యారు. రెండు మంత్రి పదవులు వున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. అందువల్ల జిల్లాకు కచ్చితంగా మరో మంత్రి పదవి వుంటుంది. ఆ పదవి కడియం నే వరిస్తుందనేది అందరూ చెబుతున్న మాట.