#నెక్కొండ, నేటి ధాత్రి:నెక్కొండ మండల కేంద్రానికి చెందిన వేద పండితుడు,
జ్యోతిష పరిశీలకులు బూరుగుపల్లి శ్రవణ్ కుమార్ జ్యోతిష వాస్తు బ్రహ్మ బిరుదు అందుకున్నారు. హైదరాబాద్ లోని లలిత కళాక్షేత్రం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎన్ ఎస్ లైవ్ ఆస్ట్రో, ఆర్యన్ ఆస్ట్రాలజికల్ రిసర్చ్ సెంటర్ అనే అంతర్జాతీయ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సెమినార్ లో జ్యోతిష,వాస్తు పండితులకు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. సంస్థ అధినేత డాక్టర్ నరసింహస్వామి చేతుల మీదుగా శ్రవణ్ కుమార్ కు జ్యోతిష వాస్తు బ్రహ్మ బిరుదును, జ్యోతిష భాస్కర పరిహార అవార్డు తో సత్కరించారు. నెక్కొండ మండలం అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి అదనపు బాధ్యతలతో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ తెలంగాణ వినియోగదారుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, వరంగల్ జిల్లా ఉమ్మడి అధ్యక్షులుగా, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా, సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా కోకన్వీనర్ గా, ఎంసీఐసీ అధ్యక్షులుగా, టి యు టి ఎఫ్ రాష్ట్ర బాధ్యులుగా, బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తూనే నెక్కొండ ప్రాంతంలో జ్యోతిష శాస్త్ర పండితులుగా సుపరిచితులు. ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న శ్రావణ్ కుమార్ కాకతీయ, ఉస్మానియా, మధురై కామరాజ్ , తెలుగు విశ్వవిద్యాలయాల నుండి ఎమ్మెస్సీ మ్యాథ్స్ , ఎంఏ సోషియాలజీ,ఎంఏ ఆస్ట్రాలజీ ఎంఎ తెలుగు,బీఎడ్ పూర్తి చేశారు. ప్రస్తుతం అప్పలరావుపేట హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్ గా, ఎఫ్ఎసి హెచ్ఎం గా పనిచేస్తున్నారు. శ్రవణ్ కుమార్ 2006-08 విద్యా సంవత్సరంలో తెలుగు యూనివర్సిటీలో ఎం ఏ ఆస్ట్రాలజీ పూర్తి చేశారు. వివాహ సమయం- జ్యోతిష ప్రభావం అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక వ్యాసానికి గుర్తింపు పొందారు.అలాగే పలు పత్రికలలో వ్యాసకర్తగా కూడా సమకాలీన అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు. గత 16 సంవత్సరాలుగా జ్యోతిష్య,వాస్తు శాస్త్రానికి ఆయన అందిస్తున్న సేవలకుగాను ‘జ్యోతిష వాస్తు బ్రహ్మ ‘గా ప్రకటించి సన్మానించారు. ఈ సందర్భంగా మంగళవారం పలు ఆధ్యాత్మిక ,ధార్మిక,బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు,మిత్రులు, వివిధ రాజకీయ,ఉపాధ్యాయ ప్రజా సంఘాల బాధ్యులు శ్రావణ్ కుమార్ ను అభినందించారు.
ఈ సందర్భంగా మంగళవారం నెక్కొండలో స్థానిక పాత్రికేయులతో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి జ్యోతిష వాస్తు బ్రహ్మ బిరుదును, ప్రధానం చేసిన ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో అంతర్జాతీయ సంస్థకి ఆర్యన్ ఆస్ట్రాలజికల్ రీసర్చ్ సెంటర్ నిర్వహకులకు, తనను అభినందించిన శ్రేయోభిలాషులకు శ్రవణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ అవార్డు తనపై బాధ్యత మరింత పెంచిందన్నారు.