రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా గోపాలరావుపేట గ్రామానికి చెందిన కాసారపు తిరుపతి గౌడ్ విధులు నిర్వహిస్తు,ఇటు మాజీ రామడుగు మండల నమస్తే తెలంగాణ దినపత్రికలో విలేకరిగా విధులు నిర్వహిస్తు అధికారులపై అజమాయిషీ చలయించుకుంటు ఏళ్లు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల మండలంలోని గ్రామాలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కాసారపు తిరుపతి గౌడ్ గత పది సంవత్సరాల నుండి మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్ల వరకు నమస్తే తెలంగాణ దినపత్రిక మండల విలేకరిగా విధులు నిర్వహిస్తూ అదే సమయంలో విద్యాశాఖ నియమనిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా విధులలో చేరారు. అప్పటి ప్రభుత్వానికి అధికార పత్రిక కావడంతో తనదైన శైలిలో విధులకు హాజరవుతూ జీతం తీసుకున్నట్టు సమాచారం. అసలే ప్రభుత్వ అధికార పత్రిక కావడంతో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు కానీ మండల విద్యాధికారికాని దీనిపై నోరు మెదపకుండా ఉండటం చూస్తే వారిపై ఆవ్యక్తి ఎలాంటి ప్రభావం చూపించారో సుస్పష్టంగా అర్థం అవుతుంది. ఏమైనప్పటికీ ఆర్ట్ విభాగంలో పిల్లలకు సరైన మెలకువలు నేర్పే అధ్యాపకులు లేకపోవడం వల్లనో మరే ఇతర కారణము చేతనో ఇప్పుడు కూడా అతడు విధులకు హాజరైతున్నాడు. కాగా ఇంత తంతు కొనసాగుతున్న నిమ్మకు నీరెత్తినట్టుగా గత కొంతకాలంగా తటస్థంగా ఉన్న ఆవ్యక్తి గత కొన్ని రోజుల క్రితం వెలుగు దినపత్రిక పేరుతో తెరపైకి వచ్చి ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన వాట్సప్ గ్రూపులలో, వివిధ వాట్సప్ గ్రూపులలో మెసేజ్ లను పెట్టి మళ్లీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండడంపై మండలం అంతట తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా మండల విద్యాధికారి అతనిపై చూపిస్తున్న విదేయత పట్ల ప్రజలలో ఒకరకమైన చర్చ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు లేక రోజువారి కూలీ సరిగా దోరకక చాలీచాలని కూలీతో బ్రతికిడిస్తుంటే, సదరు వ్యక్తి మాత్రం దర్జాగా పత్రికలను అడ్డం పెట్టుకొని సదరు అధికారులపై అజమాయిషీ చేయడం ఏమిటని మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈవిషయమై మండల విద్యాశాఖాధికారి అంబటి వేణు కుమార్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ప్రభుత్వానికి చెందిన సంస్థలలో పనిచేస్తూ, విలేకరిగా విధులు నిర్వర్తించడం విద్యాశాఖ నియమనిబంధనలకు విరుద్ధం అని తెలియజేశారు. కనీసం ఇప్పటికైనా ఈవిషయంలో జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత జిల్లా, మండల విద్యాశాఖ అధికారులపై మరియు పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులపై సరైనా విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మండలంలోని ప్రజలు కోరుతున్నారు.