రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన
జైపూర్,నేటి ధాత్రి:
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జైపూర్ పోలీసులు పేర్కొన్నారు.శనివారం స్థానిక పిఎస్ పరిధిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా నియమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ హబీబ్ మాట్లాడుతూ ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాలను వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని,కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని,పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని,వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, పరిమితికి మించిన వేగంతో వెళ్లకూడదని, శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదని వాహనదారులకు సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
