జేఏసి రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం
భవన నిర్మాణ కార్మికుల నిధులు రక్షణ కోసం నిరంతరం ఆందోళనలు చెయ్యాలి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో భవన నిర్మాణ కార్మికుల జిల్లా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఈనెల17న వినతి పత్రాలు, 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమం, డిసెంబర్ 5న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు తీర్మానం చేయనైనదని జేఏసీ సంఘాల నాయకులు తెలిపారు. ఈసమావేశంలో ఎఐటియూసి, సిఐటియూ, బిఆర్టియూ, ఇతర స్వతంత్య సంఘాలు పాల్గొన్నాయి. రౌండ్ టేబుల్ సమావేశంలో జేఎసి నాయకులు మాట్లాడుతూ కార్మిక సంఘాలతో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అడ్వైసర్ కమిటీ ద్వారా నిధులను మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతిని ఉప సంహరించాలన్నారు.
సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని, రెన్యువల్ కానీ పదమూడు లక్షల వెల్ఫేర్ బోర్డు కార్డులను వెంటనే రెన్యువల్ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ క్లెయిమ్స్ కు నిధులు విడుదల చేయాలనీ, జిల్లాల్లో లేబర్ అధికారుల అవినీతి అరికట్టాలని, ఆఫీసులో బ్రోకర్లు, ఏజెంట్లను పెట్టుకొని పనిచేస్తున ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని, లేబరు కార్డ్స్ నమోదు, రెన్యువల్, క్లెయిమ్స్ నమోదులో అధిక ఫీజు వసూళ్లు చేస్తున్న మీసేవ కేంద్రాలను సీజ్ చేయాలని జిల్లా జేఏసి సంఘాలు తీర్మానం చేశాయి. ఈడిమాండ్స్ సాధనకోసం 17వ తేదిన కార్మిక మంత్రి, లేబర్ కమిషనర్ కి వినతి పత్రాలు అందజేయాలని, ఈనెల 25న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా చేయాలని, డిసెంబర్ 5న చలో హైదరాబాద్ కార్యక్రమం చేస్తున్నామని తెలియచేశారు.
ఈకార్యక్రమాల విజయవంతంలో అన్ని రకాల భవన నిర్మాణ కార్మికులు భాగస్వాములు కావాలనివారు కోరారు. ఈరౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ యూనియన్ గౌరవ అధ్యక్షులు బుచ్చన్న యాదవ్, ఏఐటీయూసీ యూనియన్ జిల్లా అధ్యక్షులు గందె కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య సిఐటియూ యూనియన్ జిల్లా అధ్యక్షులు కదిరే రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్, బిఆర్టియూ యూనియన్ అధ్యక్షులు ఆకుల మల్లేశం, ప్రధాన కార్యదర్శి బొంకురు రాములు, ఏఐటియూసి నాయకులు రేగుల కుమార్, స్వతంత్ర సంఘాల నాయకులు గామినేని సత్యం, రమేష్, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.
