అది ఎన్కౌంటర్ కాదు బూటకపు ఎన్కౌంటర్ ఆర్సిఎస్ స్పష్టీకరణ
కరీంనగర్ నేటిధాత్రి:
సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు @ బస్వరాజ్తో సహా ఇరవై ఆరు మంది ఆదివాసి కామ్రేడ్ను పట్టుకొని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయడాన్ని రైతుకూలీ సంఘం (ఆర్సిఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరి సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. పీడిత ప్రజలతో సహా ఆదివాసుల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి బూటకపు ఎన్ కౌంటర్లో అమరులైన కామ్రేడ్స్ అందరికీ రైతు కూలీ సంఘం (ఆర్సిఎస్) రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది. వారి అమరత్వం వృధా కాదని ప్రకటిస్తుంది. మోడీ- అమిత్ సృష్టించి, నడుపుతున్న నరహంతక “ఆపరేషన్ కగార్” ఆపరేషన్ రక్తదాహానికి మరో సజీవ సాక్ష్యం ఇది. ఈనరహంతక చర్యలను ఖండించవలసిందిగా ప్రజలను ప్రజాస్వామిక వాదులను మేధావులను కోరుతున్నది. వాస్తవానికి సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు ఇటీవల అనారోగ్యానికి గురై ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పట్టుకొని తీసుకొని వచ్చి చత్తీస్ గడ్, నారాయణపూర్ అడవుల్లో ఆయనతో పాటు మరో ఇరవైఆరు మంది అమాయక ఆదివాసి ప్రజలను తీవ్ర చిత్రహింసలకు గురిచేసి అత్యంత దారుణంగా హత్య చేసి ఎదురు కాల్పుల్లో చనిపోయినట్లు ప్రకటించడం పట్ల రాజ్యాధిపతుల ఫాసిస్ట్ స్వభావం మరోసారి బహిర్గతమైనది. కొద్ది నెలలుగా కొనసాగుతున్న నరమేధం వలన సుమారు ఐదు వందల పైచిలుకు అమాయక ఆదివాసి ప్రజలు, పీడితవర్గ సమూహాల కోసం నిలబడి పోరాడుతున్న ప్రజాపోరు బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఈహంతక చర్యలు ఇకనైనా నివారించబడాలంటే తక్షణమే భేషరతుగా ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి. సాయుధ బలగాలను వెనక్కి తీసుకొని శాంతియుతంగా చర్చల ద్వారా పీడిత వర్గాల కోసం పనిచేస్తున్న మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైతుకూలీ సంఘం (ఆర్సిఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.