*జాతీయ సదస్సుకు తిరుపతి మేయర్‌ను ఆహ్వానించకపోవడం అన్యాయం..
-కేంద్ర మంత్రికి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు..
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 01:
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ నెల 3, 4 తేదీల్లో రాజ్యాంగం ప్రజాస్వామ్యం, జాతి నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషను ఆహ్వానించకుండా, డిప్యూటీ మేయర్‌ను నామినేట్ చేస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేయడంపై తిరుపతి పార్లమెంటు సభ్యులు డా.మద్దిల గురుమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖా మంత్రి మనోహర్ లాల్ కి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులోని అంశాలు పరిశీలిస్తే …
ఈ సమావేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ విడుదల చేసిన
జీవో ప్రకారం, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ను ఈ సదస్సుకు పంపనున్నట్లు పేర్కొనడం, ప్రజా ప్రాతినిధ్య నిబంధనలను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు.
మేయర్‌గా ప్రజలచే నేరుగా ఎన్నికయ్యే వ్యక్తి, నగరానికి పూర్తి ప్రతినిధిగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాంటి అధికారిక హోదా కలిగిన వ్యక్తిని పక్కన పెట్టి డిప్యూటీ మేయర్‌ను ఎంపిక చేయడం సబబు కాదని పేర్కొన్నారు.
ఇది కేవలం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నిబంధనలను ఉల్లంగించడమేనని ఎంపీ స్పష్టం చేశారు.
తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషా తిరుపతి నగరపాలక సంస్థకు మొట్టమొదటగా ఎన్నికైన మహిళా మేయర్, ప్రముఖ వైద్యురాలు, బీసీ యాదవ కమ్యూనిటీకి చెందినవారు కావడం విశేషం అని ఆయన తెలిపారు.
ఆమె ఎన్నిక, సామాజిక న్యాయం, అలాగే పురుషులతో సమానంగా రాజకీయాల్లో మహిళలు రాణిస్తున్నారనేందుకు నిదర్శనమని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకొని, తిరుపతి మేయర్‌కు సదస్సుకు తగిన ఆహ్వానం అందేలా చూడాలని, అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎంపీ డిమాండ్ చేశారు.