
వారి వల్లే ఇది సాధ్యమైంది
‘హరిహర వీరమల్లు’ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఇప్పుడువీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాదు, ఓ గొప్ప చరిత్రను మీకు పరిచయం చేయాలన్న ఆశయంతో. ఈ సినిమా ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యమైంది. వారు సినిమా విషయంలోనే కాదు నిజజీవితంలోనూ ఎందరికో స్ఫూర్తి. అందులో ఒకరు, పవన్‌కల్యాణ్. ఆయన ఓ అసాధారణమైన శక్తి. నిత్యం రగిలే అగ్నికణం. ఆయనలోని తపనని ఏ కెమెరా క్యాప్చర్ చేయలేదు. నిరంతరం స్ఫూర్తినిస్తుంటారు. ఈ చిత్రానికి వెన్నెముకలా నిలిచి ప్రాణం పోశారు. మరో వ్యక్తి ఏ.ఎమ్.రత్నం. ఎన్నో అద్భుతమైన భారతీయ చిత్రాల వెనకున్న శిల్పి ఆయన. ఈ సినిమా ఆయన ధృడ సంకల్పం వల్లే సాధ్యమైంది. ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. కేవలం దర్శకుడిగానే కాదు, మరిచిపోయిన చరిత్రను తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న వ్యక్తిగా. సంవత్సరాలుగా వేచి చూసిన సమయం ఆసన్నమైంది. ఇది అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. పవన్‌కల్యాణ్, ఏ.ఎమ్.రత్నంలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన వైదొలగడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.