అంతిమ మజిలీకి కష్టాలా?
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని బేడబుడగజంగం కులస్తులకు దహన కార్యక్రమాల నిమిత్తం గుండి రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 518లో రెండు ఎకరాల భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఈస్థలానికి స్పష్టమైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి పాడెను స్మశాన వాటికకు తీసుకు వెళ్లడానికి ఇతరుల పొలాల గట్ల వెంబడి అష్టకష్టాలు పడుతూ అంతిమ సంస్కారాలు నిర్వహించడం కష్టంగా మారింది. అంతిమ ఘడియల్లో స్మశాన వాటికకు స్పష్టమైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వారి కష్టాలు తెలపడానికి వర్ణణరహితంగా మారింది. గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని బేడ బుడగజంగా కులస్తులు వాపోతున్నారు. కొద్ది రోజుల క్రితం రామడుగు తహసీల్దార్ వెంకటలక్ష్మి స్మశాన వాటిక కోసం రహదారి విషయమై సర్వేయర్ ను తీసుకువచ్చి విచారణ చేపట్టి నెలలు గడుస్తున్నా సరైనా రోడ్డు మార్గం చూపించకపోవడంతో మాకు దిక్కెవరంటూ బేడ బుడగజంగ కులస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సర్వే జరిపి ఈసర్వే నంబర్ కి వెళ్లడానికి సరైనా రోడ్డు మార్గం కల్పించవలసినదిగా బేడా బుడగజంగం కులస్తులు అధికారులను పత్రికా ముఖముగా వేడుకొనుచున్నారు.