ర్యాంకుల పేరుతో రాచి రంపాన పెడుతున్నారు.

 

`తల్లిదండ్రులు కూడా బుద్ధి లేని ఆలోచనలు చేస్తున్నారు.

`బడులా ! బందరదొడ్లా!

`కాలేజీలా! బందిఖానాలా!!

`లక్షలు తీసుకుని నాసిరకం తిండి పెడుతున్నారు.

`పరిసరాలు అధ్వాన్నంగా వుంచుతున్నారు.

`అరకొర సౌకర్యాలు.

`లక్షలకు లక్షలు వసూలు.

`తల్లిదండ్రులకు కార్పొరేట్‌ కాలేజీలు తప్ప ఇంకే కనపడవా?

`ఏటా పదుల సంఖ్యలో పిల్లల ప్రాణాలు పోతున్నా అందులోనే చదివిస్తారా!

`పిల్లలు ప్రాణాలకన్నా చదువులే ఎక్కువా?

`లక్షల్లో చదువుతున్న వారిలో ర్యాంకులు ఎంతమందికొస్తున్నాయ్‌!

`లక్షల్లో ఫీజులు అందరూ చెల్లిస్తున్నా ర్యాంకులు కొందరికే ఎందుకొస్తున్నాయి!

`కార్పోరేట్‌ కాలేజీలలో చదివించడం ప్రస్టేజ్‌ ఇష్యూ అయ్యిందా!

`జిల్లాల పిల్లలను కార్పొరేట్‌ కాలేజీలలో చేర్పిస్తున్నారంటే అర్థముంది.హైదరాబాదులో వుండే వాళ్లు కూడా హస్టళ్లలో వేస్తున్నారు.

`ర్యాంకుల మోజును పిల్లల మీద రుద్దుతున్నారు.

`పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనౌతున్నారు.

`బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

`బతకడానికి చదువే కావాలా?

`చదువుకున్నోళ్లంతా బాగుపడతారని గ్యారెంటీ వుందా!

`కార్పొరేట్‌ అంటేనే పైన పటారం..లోన లొటారం.

మన విద్యా వ్యవస్దలో మార్పు రాదా? తల్లిదండ్రుల దృక్పధాలు మార్చుకోరా? ర్యాంకుల గోల తప్ప తల్లిదండ్రులకు మరొకటి వినిపించదా? పిల్లల మానసిక పరిస్దితి తెలియదా? వారి ఐక్యూ ఎంతో తెలుసుకునే శక్తి తల్లిదండ్రుల్లో లేదా? ప్రైవేటు కార్పోరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో చదించాలనుకునే తల్లిదండ్రులు ఎంతో కొంత ఆస్దిపరులు. విద్యావంతులే వుంటారు. వారికి సమాజం మీద ఎంతో కొంత అవగాహన వుంటుంది. వ్యవస్ధలు ఎలా వున్నాయన్న దానిని అధ్యయనం చేసి వుంటారు. అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువులో మార్కులే ప్రాతిపదిక అనుకుంటున్నారా? చదువు మీద శ్రద్దలేని పిల్లల తల్లిదండ్రులు అదే ఆలోచిస్తున్నారు. తమ పిల్లలు బాగా చదవాలంటే కార్పోరేట్‌ స్కూల్లే దిక్కని అందరూ అనుకుంటున్నారు. ర్యాంకులొస్తే చాలని చదవిస్తున్నారు. కాని పిల్లల మానసిక పరిస్దితి వారికి పట్టడం లేదు. కాని అలా బలవంతంగా పంపిన పిల్లలు కొందరు విగత జీవులౌతున్నారు. అటు తల్లిదండ్రుల ఆరాటం, ఇటు కార్పోరేట్‌ స్కూళ్లు, కాలేజీల నిర్లక్ష్యపు వ్యవహారం మూలంగా పిల్లలు ఎంతో మానసిక వ్యధకు గురౌతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. పసి వయసులో ఆట పాటలతో సాగాల్సిన బాల్యం చదువు పేరుతో బందిఖానాల్లాంటి హాస్టళ్లలో వేస్తున్నారు. ఆ కార్పోరేట్‌ స్కూళ్లలో నరకం అనుభవిస్తున్నారు. తాజాగా ఓ కార్పోరేట్‌ స్కూల్‌లో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త అందరినీ కలిచి వేస్తుంది. లక్షలు పోసి తల్లిదండ్రులు తమ పిల్లలను వారికి అప్పగిస్తే వారు చదవు తప్ప వారి బాగోగులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన వాళ్లు ఫీజులు వస్తే చాలు…నలుగురు చదవి ర్యాంకులొస్తే చాలు అన్నట్లుగానే నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి ఆరోగ్యాలను కూడా పట్టించుకోవడం లేదు. ఎంతో బంగారు భవిష్యత్తు వున్న పిల్లల మరణాలకు కూడా కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలు కారణమౌతున్నాయి. అయినా పాలకులకు పట్టింపు లేదు. ఎన్ని అవాంచనీయమైన సంఘటనలు జరుగుతున్నా వారిపై చర్యలు తీసుకున్నది లేదు. దాంతో కార్పోరేట్‌ విద్యా వ్యవస్ధ ఆడిరది ఆట పాడిరది పాటగా మారింది. పిల్లల మరణాలకు కారణమౌతోంది. తల్లిదండ్రులు గొర్రెలైతే కార్పోరేట్‌ కాలేజీలు కసాయిలౌతాయని లెటెస్టు సామెత. కాకపోతే ఈ మాట గత ఇరవై ఏళ్లుగా వినిపిస్తూనే వుంది. కాని తల్లిదండ్రులు మారడం లేదు. కాలేజీలు కూడా మారడం లేదు. ఇటు తల్లిదంద్రుల బలహీనతల్లో మార్పులు రావడం లేదు. కార్పోరేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో మరణ మృదంగం ఆగడం లేదు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకులు కావాలన్న తల్లిదండ్రుల బలహీనత కార్పోరేట్‌ కాలేజీలకు పెట్టుబడులౌతున్నాయి. వారి ధన దాహానికి వేదికలౌతున్నాయి. కాని ఎంత మంది పిల్లలు ప్రయోజకులౌతున్నారు. ఆయా కార్పోరేట్‌ స్కూళ్లు, కాలేజీలలో చదవిన ఎంత మంది విద్యార్ధులు ఉన్నతమైన భవిష్యత్తును అందుకుంటున్నారన్నది మేడిపండులో పురులాంటి నిజమే. కార్పోరేట్‌ కాలేజీలలో సౌకర్యాలన్నీ పైన పటారం. లోన లొటారమే అన్నది మరోసారి రుజువైంది. తెలంగాణ మహిళా కమీషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారద నారాయణ, చైతన్య కాలేజీల పరిశీలతో మరోసారి తేట తెల్లమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ముఖ్యంగా తెలంగాణ మహిళా కమీషన్‌ చైర్‌ పర్సన్‌ నేరెళ్ల శారదకు అభినందనలు తెలియజేయాలి. ఇంత వరకు గత ఇరవై ఏళ్లలో ఎవరూ ఇలా కాలేజీలను సందర్శించింది లేదు. అక్కడి అసౌకర్యాల మీద కాలేజీ యాజమాన్యాలను నిలదీసింది లేదు. వారి చర్యలను తప్పు పట్టింది లేదు. వారికి వార్నింగ్‌లు ఇచ్చింది లేదు. ఆ కాలేజీలను సక్రమ మార్గంలో పెట్టేందుకు కృషి చేసింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో ఆ కాలేజీలు మరింత విస్తరించాయి. కాని వాటిలో జరుగుతున్న దారుణాలను గత ప్రభుత్వం ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎన్ని సార్లు ఎన్ని వందల వార్తలు వచ్చినా ఆ కాలేజీల మీద దృష్టిపెట్టలేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. కాలేజీలకు పంపడం తల్లిదండ్రుల తప్పనట్లే గత పాలకులు వ్యవహరించారు. కాని ప్రజా ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోంది. సగటు తల్లిదండ్రులు కూడా ఎంత కష్టమైనా సరే తమ పిల్లలను కార్పోరేట్‌ కాలేజీలలో చదివిస్తేనే ఉజ్వలమైన భవిష్యత్తు వుంటుందన్న ఆపోహలో చిక్కుకుపోయారు. పైగా ఇతర తల్లిదండ్రుల తమ పిల్లలు ఎక్కడ చదివిస్తున్నారన్నదానిని కూడా అనుసరిస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లు చేస్తున్నారు. బాగా చదివే పిల్లలు ఇంటి వద్ద వుంటే సరిగ్గా చదవుకోరు అన్న ఒకే ఒక్క కారణంతో వారిని కాలేజీలకు పంపుతున్నారు. అక్కడ బాగా చదివిస్తారన్న ఒకే ఒక నమ్మకం. ఇంటర్‌ విద్యార్దుల మానసిక పరిస్దితి కూడా అర్ధం చేసుకోకుండా నరకం చూపిస్తారని కూడా తెలుసు. అయినా తల్లిదండ్రులు పిల్లలను అవే కాలేజీలలో చర్పిస్తుంటారు. అందుకోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఒక సంవత్సరానికి రెండున్నర లక్షలు తీసుకొని కార్పోరేట్‌ కాలేజీలు చెప్పే చదువేమీ వుండదు. పోటీ పరీక్షల కోసం రద్దుడం తప్ప మరేమీ వుండదు. ర్యాంకుల మాయలోపడిన తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా ర్యాంకులు కొట్టాలన్న కలలు కంటుంటారు. కాని తమ పిల్లల ఐక్యూ ఎంత అన్నది తల్లిదండ్రులు గుర్తించరు. ఏటా టివీలలో, పేపర్లలో వచ్చే ర్యాంకులను మాత్రమే చూస్తారు. నిజంగా ఆ ర్యాంకులు వచ్చిన వారు ఎంత మంది వుంటారన్నది లెక్కలేసుకోరు. నారాయణ,చైతన్య కాలేజీలలో కొన్ని లక్షల మంది చదువుతుంటారు. కాని వచ్చే ర్యాంకులు వందల్లో మాత్రమే వుంటాయి. ఆ కాలేజీలలో చదవని వారికి కూడా ర్యాంకులు వస్తాయి. ఈ విషయం తల్లిదండ్రులు తెలుసుకోరు. లక్షలు చెల్లించామా లేదా? అన్నది మాత్రమే చూసుకుంటారు. పిల్లల మానసిక పరిస్దితిని బేరీజు వేసుకోరు. కాలేజీ నుంచి తమ పిల్లవాడు చదవడం లేదన్న ఫోన్‌ కాల్‌ వస్తే నామూషీగా ఫీలయ్యే తల్లిదండ్రులు చాలా మంది వున్నారు. కాని తమ పిల్లలు ఆరోగ్యంగా వున్నారా? లక్షలు చెల్లించినా వారికి కాలేజీ మంచి పుడ్‌ పెడుతున్నారా? సౌకర్యాలు కల్పిస్తున్నారా? అన్నది చూడదు. చదువుకునే వాడికి ఆకలితో పనేంటి అన్నట్లుగానే తల్లిదండ్రులు తయారయ్యారు. ఏటా కార్పోరేట్‌ కాలేజీలలో చదువుకునే పిల్లలు మానసిక సంఘర్షణలను తట్టుకోలేక ఎంతో మంది చనిపోతున్నారు. అయినా తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వాలు కాలేజీలపై సరైన నియంత్రణ పెట్టటడం లేదు. ఇది వారికి అలుసుగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. దాంతో మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌ కాలేజీలను సందర్శిస్తున్నారు. ఆ సమయాల్లో ఆమె కళ్లారా చూసిన సంఘటనలు ప్రపంచానికి తెలిసేలా చేశారు. కాలేజీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలలో చదువులేమోగాని సౌకర్యాల కల్పన మాత్రం అంతా డొల్ల అని చూపించారు. కాలేజీలను హెచ్చరించారు. కొన్ని లక్షల మంది విద్యార్ధుల లక్షల రూపాయలు చెల్లించి చదవుకునే కాలేజీలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వుండాలి. కాని ఊపిరాడనంత ఇరుకైన గదులు. ఒక్కొ గదిలో ఇద్దరు ముగ్గురు వుండాల్సిన గదుల్లో పదుల సంఖ్యంలో విద్యార్ధులను కుక్కేస్తుంటారు. అందులో మహిళాకాలేజీలలో పరిస్ధితులు మరింత అద్వాహ్నాంగా తయారైతున్నాయి. ఆడ పిల్లలు వుండే హస్టల్‌ క్యాంపస్‌లలో సౌకర్యాలు చూస్తే కనీసం అక్కడ నిలబడలేని పరిస్దితులున్నాయని తేలింది. ఆడపిల్లల ఆరోగ్యాన్ని కాలేజీలు గాలికి వదిలేశాయి. కొన్ని వందల మంది చదువుకునే అమ్మాయిలుండే హస్టల్‌ క్యాంపస్‌లో అవసరమైనన్ని టాయిలెట్స్‌ లేకపోవడం దౌర్భాగ్యం. అందులోనూ వాటిని శుభ్రం చేయించకుండా రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తూ విద్యార్ధినుల ఆరోగ్యాలతో కాలేజీ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. కొన్ని లక్షలు పోసి చదువు కొంటున్న విద్యార్ధునులతో కాలేజీ సిబ్బంది వ్యవహరించే తీరుపై కూడా అనేక విమర్శలున్నాయి. విద్యార్ధులను పురుగుల్లా చూస్తారని తేలింది. వారికి అందించే ఆహారపదార్దాలు కూడా నాసిరకంగా వున్న విషయాన్ని స్వయంగా కమీషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద పరిశీలించారు. హాస్టల్‌ నిర్వాహాకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు వుండే రూములలో ఎలుకలు తిరుగుతూ, బొద్దింకలు సంచరిస్తూ వుంటే వారు నిద్ర ఎలా పోతారు. ఎలా చదువుకుంటారు. కనీసం వెంటిలేషన్‌ కూడా సరిగ్గా లేక, ఊపిరాడని రూంలలో బందించి ఎలుకలు, బొద్దింకల మధ్య పిల్లలు ఎలా ఆరోగ్యంగా వుంటారు. తమ కాలేజీలపై కన్నెత్తి చూసేందుకు ప్రభుత్వాలకు కూడా దైర్యంలేదన్నంతగా కాలేజీలు అరాచకం సాగిస్తూ వచ్చాయి. అందుకు ఆ కాలేజీలు ఆడిరది ఆట పాడిరది పాటగా మారింది. కేవలం కాసుల గోల తప్ప పిల్లల జీవితాల మీద కాలేజీలకు శ్రద్ద లేదన్నది తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కాలేజీలను గుర్తించి వెంటనే వారి గుర్తింపులు రద్దు చేస్తే తప్ప వాటిలో మార్పురాదు. విద్యార్దుల జీవితాలతో చెలగాటమాడరు. ఏటా విద్యార్దుల విషయంలో వినకూడని వార్తలు వినాల్సిరావు. విద్యార్దుల ప్రాణాలు గాలిలో దీపాలు కాదు. కాలేజీ అంటే దేవాలయంగా వుండాలే తప్ప జైలులా వుండకూడదు. వారి మానసిక ఎదుగుదలకు తోడ్పాటును అందిచేలా వుండాలే తప్ప పసి ప్రాయంలోనే వారి జీవితాలు చిదిమేసేలా వుండకూడదు. విద్యా వ్యవస్ధలో కార్పోరేట్‌ వ్యవస్ధకు మంగళం పాడితే తప్ప తల్లిదండ్రులకు గర్భశోకాలు తప్పవు. చదువు..చదవూ అనే మాట తల్లిదండ్రులు మర్చిపోతేనే కార్పోరేట్‌ కాలేజీలు మాయం కావు. తప్పు తల్లిదండ్రులది కాకపోయినా శిక్షను అనుభవిస్తున్నారు. శిక్షణ ఇవ్వాల్సిన కాలేజీలు జీవితశిక్షలు విదిస్తున్నాయి. మళ్లీ మీ పిల్లలు జీవితంలో కనిపించనంత దూరం పంపిస్తున్నాయి. వారి జీవితాలను చిదిమేస్తున్నాయి. తల్లిదండ్రులకు గర్భశోకాలు మిగిల్చుతున్నాయి. అయినా తల్లిదండ్రులు మారారా? ముందు తల్లిదండ్రులు మారాలి. అప్పుడుగాని కార్పోరేట్‌ విద్యాసంస్దల తీరు మారుతుంది. వారి మనుగడ ప్రశ్నార్ధకంలో పడుతుంది. లేకుంటే మీ పిల్లలకు చదువు చెప్పుడే ఎక్కువ…అంతగా వారి ఆగడాలు పెరిగిపోతే ఇలాంటి పరిస్దితులే ఎదురౌతాయి. మీ పిల్లలు మీకు కాకుండాపోతారు. అప్పుడు ఎవరికోసం బతుకుతారు? ఎందుకోసం బతుకుతారు? జీవితాంతం కుళ్లకుళ్లి ఏడ్చి ఏం సాధిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. కార్పోరేట్‌ స్కూళ్లు, కాలేజీలలో జాయిన్‌ చేసేప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి. అక్కడ చదవలేమని, మా వల్ల కాదని పిల్లలు చెప్పినప్పుడు పెడ చెవిన పెట్టకండి. పిల్లలకు మారం ఎక్కువైందని మీ అతి తెలివి చూపకండి. వారిని ప్రేమించండి. కన్నందుకు వారికి బతకన్విండి. చదువు పేరుతో బతికుండి వారికి నరకం చూపకండి. తర్వాత జీవితాంతం మీరు నరకం చూడకండి. తల్లిదండ్రులారా తస్మాత్‌ జాగ్రత్త.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!