మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ ని అనుబంధం గా ఉన్న జీవవైవిధ్య పరిశోధనా మరియు విద్యాకేంద్రం లో అంతర్జాతీయ ఆటవీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ అసిస్టెంట్ కోర్స్ కోఆర్డినేటర్ శ్రీ వంశీకృష్ణ పాల్గొన్నారు. వీరిని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య పర్యావరణ హిత బొకేతో స్వాగతం పలికారు. ఆయనతో పాటుగా అకాడెమీ లో శిక్షణ పొందుతున్న 35 మంది అటవీక్షేత్రాధికారులు తెలంగాణ బొటానికల్ గార్డెన్ సందర్శనార్థం విచ్చేసారు. గార్డెన్ లోని వివిధ భాగాలను సందర్శించి అంతరించి పోతున్న సీతా అశోక మొక్కను నాటి నీళ్లు పోశారు. లాబ్ లో ఉన్న పాములను అదేవిధంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హెర్బేరియం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ మాట్లాడుతూ అడవులే మానవాళికి రక్ష అని, అడవుల నుండి మానవాళికి అవసరమైన ఆహారం, ఔషధము, కలప ఇతర సామాగ్రితో పాటు జీవించడానికవసరమయ్యే ఆక్సిజన్ ను అందిస్తాయన్నారు. వాటిని సంరక్షించుట మనందరి బాధ్యత అని తెలిపారు. గార్డెన్ సమన్వయకర్త డా. బి. సదాశివయ్య మాట్లాడుతూ అడవులను కాపాడే సైనికులు ఆటవీక్షేత్రాధికారులు అని, దేశ రక్షణ లో సైనికులు ఎలా కష్టపడుతున్నారో అలాగే వీరు కూడా అడవులను కాపాడుతున్నారని శిక్షణా ఆటవీక్షేత్రాధికారులనుద్దేశించి అన్నారు. 2012 నుండి ఐక్యరాజ్య సమితి వారు మార్చ్ 21 ని అంతర్జాతీయ అటవీ దినోత్సవం గా పరిగణించారని అప్పటి నుండి అనేక దేశాలు ఈ దినోత్సవం జరుపుతున్నాయన్నారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశంతో ఈ దినోత్సవం జరుపుతున్నారు. ఈ సంవత్సరం అడవులు మరియు ఆవిష్కరణలు: మెరుగైన ప్రపంచానికి కొత్త పరిష్కారాలు అనే నేపథ్యంలో జరుపుకుంటున్నాం. అనేక సమస్యలకు అడవులు పరిష్కారాన్ని చూపుతాయని తెలిపారు. అనంతరం శిక్షణా అధికారులు అక్షయ్ గైక్వాడ్, మనీషా లు మాట్లాడుతూ ప్రపంచ అటవీ దినోత్సవం రోజున తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. గార్డెన్ అభివృద్ధి చేసిన తీరు ఆకర్షించిందన్నారు. విద్యార్థుల పాత్రపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథి వంశీకృష్ణ మాట్లాడుతూ మేమంతా అటవీశాఖ లో పనిచేస్తున్నా ఎక్కువ అడవుల సంరక్షణ గురించి తెలుసుకోలేక పోతున్నాం అని, కానీ ఈ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఒక్కటీ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న అడవులు చూసినట్టే అన్నారు. అంత అద్భుతంగా గార్డెన్ ఉందన్నారు. శిక్షణ పొందుతున్న అటవీ క్షేత్రాధికారులు వారి పాఠ్య ప్రణాళికలో భాగంగా అనేక అటవీ ప్రాంతాలు తిరిగినా ఇంత జ్ఞానం రాదని ఇక్కడ అనేక రకాల మొక్కలుండటం వల్ల ఉపయుక్తంగా ఉందన్నారు.
అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు సదాశివయ్య ముఖ్య అతిథిని సన్మానించారు. పొలికి చెట్టు ఫలాలు, విత్తనాలతో చేసిన మాలతో మరియు సలువాతో ఘనంగా సన్మానించారు. శిక్షణాధికారులు కళాశాల ప్రిన్సిపాల్ ను మెమోంటో తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థి రమాదేవి, వాలంటీర్లు రాహుల్, వీరంజనేయులు, మేఘన, అనసూయ తదితరులు పాల్గొన్నారు.