ఒకటో వార్డులో అధ్వానంగా అంతర్గత రోడ్లు
రెండేళ్లుగా ఫిర్యాదు చేసిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు
నర్సంపేట మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో గల అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆ వార్డు మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆరోపించారు. వార్డు పరిధిలో ఉన్న అన్ని వీధుల్లో పారిశుద్ధ్యం లోపించి కంపు కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బురదమయంగా మారుతున్న అంతర్గత రోడ్ల పట్ల గత రెండు సంవత్సరాలుగా మున్సిపాలిటి అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆరోపించారు.
పారిశుద్ధంపట్ల చెత్త సేకరణ కోసం రెండు రోజులకు ఒకసారి రావాల్సిన సంబంధిత వాహనము వారం రోజులైనా రాకపోవడంతో గత కొంతకాలంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి.. చెత్త పేరుకుపోయిన 1వ వార్డు గల్లీలు ఆడవిని తలపిస్తున్నది వాపోయారు. డ్రైనేజీ కాలువలు తీయక.. మురికితో నిండిపోయి..ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయి.దుర్వాసన వెదజల్లుతున్న డ్రైనేజ్ కాలువలను మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోని ఆగ్రహం వ్యక్తం చేశారు.అపరిశుభ్రతతో ఈగలు,దోమల దాడులతో వార్డు ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారని పేర్కొన్నారు.చిన్న వర్షం పడ్డ అంతర్గత మట్టి రోడ్లన్నీ బురుదమయమై నడవడానికి కూడా వీలు లేకుండా..కాలు వేస్తే కాలు తీయలేని పరిస్థితి నెలకొందని వివరించారు.
డ్రైనేజ్ కాలువ పక్కనే వేసిన మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీలు ఏర్పడి మిషన్ భగీరథ వాటర్ వదిలినప్పుడల్లా డ్రైనేజీ నీటిలో కలిసి కలుషితమవుతున్నాయని గతంలో మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన నేటికీ కూడా మరమ్మతులు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లుగా మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం కోరారు.
