Indiramma Saree Distribution Begins with Strict Guidelines
ఇంటింటికి ఇందిరమ్మ చీర
#ఎస్‌హెచ్‌జీ వెలుపల ఉన్న మహిళలకు సభ్యత్వం ఇచ్చి చీరలను వెంటనే ఇవ్వాలి.
#మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతను, ఇందిరా మహిళా శక్తి విజయాలను చాటేలా నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాలు
#గ్రామాల్లో ఇంటింటికి వెల్లి చీరలు పంచాలి
#ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పంపిణి వివరాలను ఎప్పటి కప్పుడు నమోదు చేయాలి.
అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా,నేటిధాత్రి:
ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెర్ప్ ఉన్నతాధికారులతో గురువారం నాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి సీతక్క అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మహిళల గౌరవం, వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం ప్రారంభించిన ఈ మహత్తర కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగాలని ఆమె పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు చీర అందేలా పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీతక్క సూచించారు.ఇంకా స్వయం సహాయక బృందాల్లో లేని మహిళలకు అవగాహన కల్పించి, వెంటనే వారికి సభ్యత్వం ఇచ్చి ఇందిరమ్మ చీరలను అక్కడికక్కడే అందించాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించారు. నూతన లబ్దిదారులను గుర్తించేందుకు పౌర సరఫరాల శాఖ సహకారాన్ని తీసుకోవాలన్నారు. ప్రస్తుత, కొత్త లబ్ధిదారుల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన సెర్ప్ ప్రొఫైల్ యాప్ ద్వారా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు.
పంపిణీ కార్యక్రమం దశలవారీగా నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుండి డిసెంబర్ 9 వరకు మొదటి దశలో, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుండి 9 వరకు రెండో దశగా పంపిణీ చేయాలని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా, ప్రతి నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో స్థాయి ప్రత్యేక అధికారిని నియమించి, నియోజకవర్గం నుంచి మండల, గ్రామ స్థాయిల వరకు పంపిణీని పర్యవేక్షించేలాగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీతక్క సూచించారు.
ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతను, ఇందిరా మహిళా శక్తి విజయాలను చాటే విధంగా నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో కార్యక్రమం జరగాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ లు మరియు ప్రజాప్రతినిధులందరికీ మండల స్థాయి కార్యక్రమాలకు ఆహ్వానం పలకాలని ఆమె అధికారులను కోరారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితో పాటు గ్రామ మహిళ స్వయం సహాయక బృందాల సభ్యులు..లబ్దిదారుల నివాసాలకు వెల్లి ఇందిరమ్మ చీరలను బొట్టుపెట్టి అందచేయాలని సూచించారు. మహిళల ఐక్యతను చాటే విధంగా ఇంటింటికి ఇందిరమ్మ చీరలు చేర్చుతామన్నారు.
లబ్ధిదారుల వివరాలను సేర్ఫ్ ప్రొఫైల్ యాప్ ద్వారా నమోదు చేయడం తప్పనిసరి అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా ఆధార్ డేటా, ఫోటోల సేకరణ జరగాల్సి ఉన్నందున అధికారులు పూర్తి సన్నద్ధతతో వ్యవహరించాలని సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మహిళల జీవితాల్లో ఆనందాన్ని నింపే పండుగలా మారాలని, ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రచారం పెంచాలని సీతక్క ఆదేశించారు.
