నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకం లో పూర్తిచేసి నిరుపేదలకు ఇవ్వాలి…
అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్.**
భద్రాచలం నేటి ధాత్రి
ఏఎంసీ కాలనీ నందు మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి. పౌల్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ…. పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని అన్నారు.
ప్రజా సమస్యల మీద మాల మహానాడు ఎప్పుడు పోరాటం చేస్తుందని, ప్రతి పేద కుటుంబానికి భూమి, విద్య, ఉద్యోగం, కలిగి ఉండాలని అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకి న్యాయం జరుగుతుందని అనుకుంటే అన్యాయం జరిగిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అనుకుంటే ఆశ నిరాశగా మిగిలిందని ఆవేదన వ్యక్తపరిచారు. భద్రాచల పట్టణంలో సొంత ఇల్లు లేక అనేకమంది నిరుపేదలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, భద్రాచల పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇల్లులుగా కేటాయించి నిరుపేదలకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అద్దె ఇళ్లలో ఉంటూ రోజువారి కూలికి వెళ్తూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, కరెంటు చార్జీలు కట్టలేక ఇంటి అద్దెలు కట్టలేక సతమతం అవుతున్నారని అన్నారు. భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న ప్రజలు మరింత పేదలగానే మిగిలిపోతున్నారని, ప్రభుత్వాలు మారిన,పేదల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కలలు సహకారం చేయాలనుకుంటే ముందుగా అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో గుంట.కిషోర్, నాని, గుండు.జిమ్మీ, కిట్టు , మింటు, ఏసుబాబు, శాంతి రాజు, వంశీ, తదితరులు పాల్గొన్నారు.