 
        Indiramma Houses
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి. అనర్హులకు ఇవ్వడం సరైనది కాదు.
ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పథకాన్ని కొంతమంది అభాసుపాలు చేస్తున్నారు
పారదర్శకత లేనట్లయితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలి
ఎన్ హెచ్ ఆర్ సి. సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మెహేందికార్ సందీప్
“నేటిధాత్రి”,సూర్యాపేట టౌన్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు, గూడులేని నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీ పేరిట ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు కంకణం కట్టుకున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మెహిందీకార్ సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరితో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేయడం సరికాదని అసలైనటువంటి నిరుపేదలకు, ఒంటరి మహిళలకు చెందాల్సినటువంటి ఇండ్లను స్థానికంగా ఉన్నటువంటి కొందరు నాయకులు, ఎంపిక చేసి అధికారులు కుమ్మక్కై కార్లు , లక్షల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయిస్తున్నారని అక్కడక్కడ ఒకే ఇంట్లోనే రెండు ఇండ్లు కూడా కేటాయించి నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత లేనట్లయితే సంబంధించిన అధికారులని బాధ్యులని చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ కమిటీకి సంబంధించిన అధికారుల జాబితాను తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను అప్రతిష్టపాలు చేయడానికి అధికార పార్టీ పేరిట కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి అర్హులైన వారికే ఇండ్లను కేటాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోటాచారి, అధికార ప్రతినిధి నామ వేణు, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు నెల్లుట్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

 
         
         
        