
MP Gurumurthy’s
*సహజ వ్యవసాయంలో దేశీయ గోవుల పాత్ర..
*పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి ప్రస్తావన..
తిరుపతి(నేటి ధాత్రి)అగస్టు 19:
దేశీయ ఆవుల లభ్యతపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సహజ పద్ధతులు పెరుగుతున్న వేళ, దేశీ ఆవుల కొరత రైతులకు పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు జాతుల సంరక్షణ, అభివృద్ధి, పెంపకానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సమాచారం కోరారు. అలాగే, రైతులకు దేశీ ఆవుల పెంపకం కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలు, గత మూడు సంవత్సరాల్లో లబ్ధిదారుల వివరాలు, భవిష్యత్‌లో తీసుకోబోయే కొత్త కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బాఘెల్ సమాధానంగా, దేశీయ ఆవుల సంరక్షణకు కేంద్రం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2019 పశుగణన ప్రకారం, దేశంలో 193.46 మిలియన్ పశువులుండగా, వీటిలో 73.45% దేశీయ జాతులవని చెప్పారు.
గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 8.55 కోట్ల కృత్రిమ గర్భధారణలు నిర్వహించగా, 2.78 కోట్ల రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 91.61 లక్షల కృత్రిమ గర్భధారణలు జరిగి,18.52 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఆవుల నాణ్యత పెంపు కోసం లింగ క్రమబద్ధీకరించిన వీర్యం, ఐవిఎఫ్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులు వినియోగిస్తున్నారని తెలిపారు. గుంటూరు, చింతలవెల్లి లాంటి ప్రాంతాల్లో ఐవిఎఫ్ కేంద్రాలు, గోకుల్ గ్రామాలు ఏర్పాటు చేశారన్నారు. దేశవ్యాప్తంగా 38,736 సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 4,746 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటి ఉద్దేశ్యం దేశీయ ఆవుల రక్షణతో పాటు,సహజ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, రైతుల ఆదాయం పెంచడమే అని మంత్రి తెలిపారు.
ఎంపి గురుమూర్తి కామెంట్స్ : రాష్ట్రాలతో సమన్వయం పెంచుకోవాలని, దేశీయ ఆవుల పెంపకాన్ని మరింత బలోపేతం చేయాలని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ఫలితాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయం, సహజ వ్యవసాయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరింత బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.