ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన దుగ్గి రాంబాబు అలియాస్ రియాజ్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ సభ్యులు, శుక్రవారం సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపందా) పార్టీలోకి ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, ఆ పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ ,గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, పార్టీ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, పి వైఎల్ రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్, సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజా పందా) ఆళ్లపల్లి ఏరియా ఆర్గనైజర్ బోర్ర వెంకన్న తదితరుల సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా మాస్ లైన్ నేతలు మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినటువంటి దుగ్గి రాంబాబు లాంటి వారు పార్టీలో చేరడం శుభపరిణామమని, ప్రజా ఉద్యమాల బలోపేతానికి ఉపయోగపడుతుందని అన్నారు.
మార్చి 3 న జరిగే బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ
పిసిసి సిపిఐ( ఎంఎల్ ), సిపిఐ( ఎంఎల్)ఆర్ఐ, సిపిఐ ( ఎంఎల్) ప్రజాపందా మూడు పార్టీలు కలిసి ఐక్యమవుతున్న సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహణ కొరకు విడుదల చేసిన పోస్టర్ ను శుక్రవారం సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపందా) కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈ సం శంకర్ లు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అమలుపరుస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని అన్నారు. అధికారంలోకి రాకముందు బ్లాక్ మనీ బయటికి తీస్తామని, ప్రతి భారతీయ పౌరుడి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు నమ్మబలికి అధికారం చేజెక్కించుకున్న తర్వాత భారత రాజ్యాంగంలోని జీవో 370,5వ ఆర్టికల్ లాంటి అనేక చట్టాలను తొలగించిన చరిత్ర బిజెపి ప్రభుత్వానికి ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి అధికారంలోకి రావడానికి, భారతదేశ ప్రజల మధ్య మతం అనే చిచ్చుపెట్టి గెలవడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. రానున్న పార్లమెంటరీ ఎన్నికలలో దేశ ప్రజలు బిజెపి ప్రభుత్వానికి అధికారం ఇస్తే వెనకబడిన కులాలకు సంబంధించిన అనేక చట్టాలను రద్దు చేసే దుర్మార్గమైన చర్య చేపట్టబోతున్నారన్నారు. భారత విప్లవోద్యమంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా నూతన సిద్ధాంతాన్ని ధైర్యంగా చెప్పుకొని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఐ(ఎంఎల్) ప్రజా పందాను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. దేశంలోని విప్లవకారులు ప్రజా పందా తీసుకున్న నూతన సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి బలమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. అందులో భాగంగా పిసిసి సిపిఐ (ఎంఎల్), సిపిఐ(ఎంఎల్)ఆర్ఐ పార్టీలు కలిసి ఐక్యం అవుతున్నామని ఈ సందర్భంగా మార్చి మూడో తారీఖున ఖమ్మం నగరంలో వేలాది మందితో జరిగే యూనిటీ బహిరంగ సభకు ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనంతోగు మాజీ సర్పంచ్ ఈసం చంద్రయ్య, గుండాల మాజీ ఉప సర్పంచ్ ధరావత్ ఆల్యా, పార్టీ జిల్లా, డివిజన్, మండల నాయకులు పాయం వెంకన్న, పూనెం మంగయ్య, ఈసం సింగన్న, ఈసం కృష్ణ, కోడూరు జగన్, యనగంటి గణేష్, సనప కుమార్, మోకాళ్ళ ఆజాద్, కుంజ రమేష్, ధరావత్ మోహన్, దుగ్గి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.