నూతన జాతీయ విద్యా విధానం రాజ్యాంగ స్ఫూర్తికి అంత్యంత ప్రమాదకరం -ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిమచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
రాజ్యాంగ స్ఫూర్తికి అంత్యంత ప్రమాదకరంగా జాతీయ నూతన విద్యా విధానమని, దీని రద్దుకై విద్యార్థులు ఉద్యమించాలని, ఫిబ్రవరి 9,10 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కరీంనగర్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాల కరపత్రాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈసందర్బంగా మచ్చ రమేష్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ నూతన విద్యావిధానం -2020 పేరుతో విద్యను పూర్తిగా తమ ఆధిపత్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ విద్య కేంద్రీకరణ, కార్పోరేటీకరణ, వ్యాపారీకరణను, కాషాయికరణను ప్రోత్సహించే నిర్ణయాలు చేస్తున్నదని, నేడు దేశంలో నూతన విద్యావిధానం పేరుతో యూనివర్శీటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతీసే ప్రయత్నం కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తున్నాదని ఆయన విమర్శించారు. యూనివర్శీటిలను మూడు, నాలుగు రకాలుగా విభజన చేసి విద్యను కార్పోరేటీకరణ, ప్రైవేటీకరణ, కమర్షలైజేషన్, కాషాయికరణ చేస్తుందని దానికి నిదర్శనం మొన్న విడుదల చేసిన ‘యూజీసీ’ ప్రతిపాదనలని రమేష్ అన్నారు. ఈవిధానాలు ప్రభుత్వం విద్య వ్యవస్థను ధ్వంసం చేయడానికి తీసుకుంటున్న చర్యలని అయన ఆరోపించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఆరెస్సెస్ ఎజెండా అమలుకు బిజెపి ప్రయత్నం చేస్తుందని, ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నవారినే యూనివర్శీటీలలో నియమాకాలు చేస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం పది శాతం బడ్జెట్ కేటాయింపులు చేయకుండా, జిడిపిలో ఆరుశాతం నిధులు కేటాయించకుండా ఎలా ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షిస్తారని ప్రశ్నించారు. నూతన విద్యావిధానం, విశ్వవిద్యాలయాల ఫండ్ కట్స్, ఫెలోషిప్స్ ఇవ్వకపోవడం, ఖాళీలు భర్తీ చేయకుండా ఉండడం, యూనివర్శీటీలలో ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయడంపై ఉద్యమించాలని ఆయన కోరారు. నూతన జాతీయ విద్యా విధానంలో ఎక్కడ కూడా ఉచిత విద్య అనే పదాన్ని కూడా పొందుపరచకుండా నూతన జాతీయ విద్యా విధానంలో పేదవారికి ఉచిత విద్యా లేనట్టేనని అయన పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాలలో ప్రజాస్వామ్యం, సెక్యులర్ పదాలను, డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించి దాని స్థానంలో బ్రిటిష్ ముస్కర్లకు తోత్తగా వ్యవహరించిన ఆర్ఎస్ఎస్, హెడ్వార్గ్, వీర సావర్కర్ మొదలగు వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దేశ చరిత్రను, తెలంగాణ సాయుధ పోరాట వాస్తవాలను వక్రీకరించడంలో బిజెపి ముందుందని అన్నారు. విభిన్న జాతులు కలిగిన వారు భారతదేశంలో ఉన్నారని, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశంలో ఒక కులాన్ని, ఒక మతాన్ని ప్రోత్సహించే బిజెపి భారతదేశ చరిత్రను వక్రీకరిస్తున్నది అయన అన్నారు. తక్షణమే జాతీయ నూతన విద్యా విధానాన్ని ఉపసహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ నూతన విద్యా విధానం రద్దుకై విద్యార్థులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వస్తున్న ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 7850 వేల రూపాయల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, గురుకుల పాఠశాలలో విషాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో యూనివర్సిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, విద్యా శాఖ మంత్రిని కూడా నియమించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. దేశ వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై చర్చించేందుకు ఫిబ్రవరి 9,10 తేదీలలో హైదరాబాద్ లో జరిగే ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సమావేశాలు వేదిక కానున్నాయని, ఈజాతీయ సమితి సమావేశాలను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్ నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్ ఉపాధ్యక్షులు కనకం సాగర్,జిల్లా నాయకులు కసిరెడ్డి సంధీప్ రెడ్డి, సప్న, రవళి, రమ్య, మనీషా, తదితరులు పాల్గొన్నారు.