
భవిష్యత్లో.. రివ్యూలు మూడు రోజుల తర్వాతే
సినిమా రివ్యూల విషయంలో నటుడు విశాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా వైరల్ అవుతున్నాయి.
భవిష్యత్లో కొత్త సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాతే థియేటర్ ప్రాంగణంలో పబ్లిక్ రివ్యూలకు అనుమతించాలని విజ్ఞప్తి చేయనున్నట్టు నడిగర్ సంఘం (Nadigar Sangam) ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ (Vishal) తెలిపారు. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భవిష్యత్లో ఒక సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత అంటే 12షోలు ప్రదర్శించిన తర్వాతే థియేటర్ ప్రాంగణంలో పబ్లిక్ రివ్యూల కోసం అనుమతించాలని, దానికంటే ముందు అనుమతించవద్దని థియేటర్ యాజమాన్యాలతో పాటు నిర్మాతలకు, పంపిణీదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
అవసరమైతే థియేటర్ బయట పబ్లిక్ టాక్ తీసుకోవచ్చని లేదా యూట్యూబర్లు సినిమా చూసి వారే రివ్యూలు రాసుకోవాలన్నారు. సినిమాను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా మరో రెండు నెలల్లో తన వివాహం జరుగుతుందని, ఈలోగా నడిగర్ సంఘం భవనం సిద్ధమవుతుందన్నారు. ఆగస్టు 29వ తేదీ ఓ కీలక ప్రకటన చేస్తామన్నారు. నడిగర్ సంఘం భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు తాము పరుగెత్తుతున్నామన్నారు. ఇదిలాఉంటే.. ఆగస్టు 29న హీరోయిన్ సాయి ధనిష్క (Sai Dhanshika) కు తనకు వివాహమని గతంలో విశాల్ ప్రకటించిన విషయం తెల్సిందే.