జడ్జి పై దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు:-
సంఘీభావం తెలిపిన వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్లు:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
రంగారెడ్డి జిల్లా కోర్ట్ నందు 9వ అదనపు జిల్లా జడ్జి పై గురువారం నాడు జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు తేది 14-02-2025 రోజున కోర్టు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ లు తమ సంఘీభావం తెలిపి కోర్టు విధులను బహిష్కరించారు.
వివరాల్లోకి వెళితే హత్యాయత్నం కేసులో కరణ్ సింగ్ అనే ముద్దాయికి నేరం రుజువు కావడంతో మంగళవారం రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి యావజ్జీవ శిక్ష విధించారు, కాగా ఇదే ముద్దాయిపై మరొక కేసు విషయంలో గురువారం కోర్టులో ప్రవేశ పెట్టగా, జడ్జి గారు ఇట్టి కేసును విచారిస్తుండగా, జైల్లో పోలీసులు నన్ను వేధిస్తున్నారని అంటూ జడ్జి గారి ముందుకు వెళ్ళిన ముద్దాయి కరణ్ సింగ్ తన కాలు చెప్పును తీసి జడ్జి గారి మీదికి విసిరారు, అది జడ్జి గారికి తగలకుండా ప్రక్కకు పడిపోయింది మరియు అంతటితో ఆగకుండా గట్టిగా అరుస్తూ జడ్జి గారిని తిట్టడం జరిగింది.
దీనిని తెలంగాణ జ్యుడీషియల్ సంఘం ఖండించింది, సంఘం అధ్యక్షులు కె. ప్రభాకర్ రావు మాట్లాడుతూ విచారణ సందర్భంగా మహిళా జడ్జి పై నిందితుడు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూనట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఓపెన్ కోర్టులో మహిళా న్యాయమూర్తి పై దాడి చెయ్యడం మరియు బెదిరించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. కరుడు గట్టిన నేరస్థుల కేసులు నిత్యం విచారించే జడ్జిల భద్రతకు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా జడ్జి గారి పై జరిగిన దాడి విషయంలో తెలంగాణ అడ్వకేట్ ఫెడరేషన్ సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం కోర్టు విధులకు హాజరుకాకుండా నిరసనలు వ్యక్తం చెయ్యాలని నిర్ణయనుసారం వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ల ఆధ్వర్యం లో నిరసనలు వ్యక్తం చెయ్యడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో ఇరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ రమేష్ బాబు, జీవన్ గౌడ్ మరియు ఇతర కమిటీ మెంబెర్స్ తో పాటు సీనియర్ న్యాయవాదులు సహోదర రెడ్డి, అంబరీష్ రావు, విద్యాసాగర్ రెడ్డి, ఆనంద్ మోహన్, నర్సింగ రావు మరియు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబెర్స్ జయాకర్, జనార్ధన్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.