విస్తరణలో.. ఇద్దరి మాటే చెల్లుబాటు!

`సిఎం. రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటిల అభిప్రాయమే ఫైనల్‌

`రోజుకో వార్తతో ఆశావహుల లీకులు

`డీల్లీలో పెద్ద ఎత్తున పైరవీల ప్రయత్నాలు

`అధిష్టానం ఇంత వరకు ఎవరికీ అప్పాయింట్‌ ఇవ్వలేదు

`నాయకుల బెదిరింపులన్నీ ఉత్తమాటలే

`అధికార పార్టీకి రాజీనామా చేసేంత ధైర్యం ఎవరూ చేయలేరులే!

`ఇప్పటికే పదవులున్న కుటుంబాలకు చోటు దక్కదు

`పార్టీ గెలుపుకు పని చేసిన వారికే గుర్తింపు

`సిఎం. రేవంత్‌ అభిప్రాయమే ఫైనల్‌

`అధిష్టానం పూర్తిగా రేవంత్‌ నిర్ణయాలకే విలువ

`నాలుగు మంత్రులు కాదు..ఆరుగురి ప్రమాణం కోసమే వాయిదా

`విజయశాంతికి మంత్రి వర్గంలో చోటు

`తెలంగాణ ఇచ్చిన వెంటనే పార్టీలో చేరిన తొలి నాయకురాలు

`తెలంగాణ కోసం పార్టీ పెట్టి కొట్లాడిన ఏకైక నాయకురాలు

`ఇప్పటికైనా ఆమె సేవలు వినియోగించుకోవాలని నిర్ణయం

`నల్గొండ జిల్లా నుంచి ఒకరికి అవకాశం

`రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం కాదు

`వెంకట స్వామి కుటుంబానికి ఇవ్వడం కుదరదు!

`అధిష్టానం ఆశీస్సులు, రేవంత్‌ రెడ్డి మెప్పులు వున్న వారికే పదవులు

`జాప్యానికి ప్రత్యేక కారణమేమీ లేదు

`మంత్రుల తొలగింపు ప్రస్తావనే లేదు

`శాఖల మార్పులకు ఆస్కారమే లేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
తన రాజకీయాన్ని తనే బైటేసుకోవడంలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ మరొకటి వుండదు. కాంగ్రెస్‌పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు. అయితే గతంలో గ్రూపుల మాటలు, చెప్పే చాడీలు బాగా చెల్లేవి. కాని కొన్ని సంవత్సరాలుగా ఆ చెప్పుడు మాటలకు పెద్దగా విలువ వుండడం లేదు. అయినా కాంగ్రెస్‌ నాయకుల తీరు మారడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని రకాల మాటలు మాట్లాడినా పార్టీ అధిష్టానం ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి మాటలకు వుండే విలువ వేరు. ఈ సంగతి తెలిసినాకొంత మంది సీనియర్లు తమ పూర్వపు అలవాటును మానుకోవడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌లోకి రేవంత్‌రెడ్డి రాకముందు ఒకలెక్క. రేవంత్‌ రెడ్డి పిసిసి. అయిన తర్వాత ఒక లెక్క. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలో సిఎం. రేవంత్‌రెడ్డి మాటకు వున్న విలువ మరొకరికి వుండదు. కాని తమ మాట చెల్లుతున్నట్లుగా, తమకు అదిష్టానం వద్ద అందరికంటే విలువెక్కువ అనిచెప్పుకోవడంలో చాలా మంది సీనియర్‌ ముందున్నారు. వారి మాటలకు ఎక్కడా విలువ లేదని తెలుసు. అయినా రాజకీయాల్లో వెనుకబడ్డామన్న నిజాన్ని వారు ఒప్పుకోలేరు. పైగా పార్టీని అదికారంలోకి తీసుకురావడం వారి వల్ల కాలేదన్నది కూడా సత్యం. అయినా తమకు ప్రాదాన్యత కోసం పాకులాడడం వారు మానుకోవడం లేదు. ప్రతి దానిలోనూ పుల్లలు పెట్టడం ఆపడంలేదు. ప్రత్యర్ధి పార్టీల మీద వారి ప్రతాపం కనిపించదు. బిఆర్‌ఎస్‌ మీద ఆరోపణలు చేయడానికి ధైర్యం చాలదు. బిజేపి మీద నోరు పారేసుకునేందుకు ధైర్యం చేయలేరు. కాని సొంత పార్టీ మీద మాత్రం లేనిపోని లీకులిచ్చి, పార్టీ పరువు తీయడం మాత్రం చాలా మందికి తెలుసు. అందుకే వారిని పార్టీ అదిష్టానం ఏనాడో పక్కన పెట్టింది. కాకపోతే రాజకీయ పార్టీలలో మంచిచెడు రెండూ వుంటాయి. పార్టీని పట్టుకొని వేళాడుతూనే, మరో పక్క పార్టీని ముంచే నాయకత్వం చేస్తూ వుండేవారు వుంటారు. వారిని పార్టీలు పక్కన పెట్టలేవు. అలాగని వారిని నెత్తిమీద పెట్టుకొని ఊరేగలేవు. వారికి అపరిమితమైన ప్రాదాన్యత ఇవ్వవు. అలాంటి నాయకులు కాంగ్రెస్‌లో చాలా మంది వున్నారు. ఏదైనా పార్టీకి మంచి పేరొస్తే మాత్రం మా వల్లనే అని ప్రచారం చేసుకుంటారు. ఏదైనా తేడా జరిగితే అంతా సిఎం. మీదనే తోసేందుకు కూడా వెనుకాడరు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పదాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తుంటారు. ఎందుకంటే రాష్ట్రంలో అనేక రకాల సమస్యలున్నాయి. వాటి మీద ఏ ఒక్కరూ మాట్లాడరు. ప్రతిపక్షాలకు ధీటైన సమాధానమివ్వరు. కాని సొంత పార్టీలే బాజరుకీడుస్తుంటారు. ఇటీవల జరిగిన కొన్నిమంచి విషయాలు యువ వికాసం పేరుతో యువతకు ఎంతో మేలు చేసే మంచిపనికి శ్రీకారం చుట్టారు. కాని ఆ పధకంపై విసృతమైన ప్రచారానికి ఏ ఒక్క నాయకుడికి మాటలు రావు. దేశంలో ఎక్కడా లేని సన్నబియ్యం పధకం అమలుపై ఏ ఒక్క నాయకుడు నోరెత్తదు. బిజేపి చేస్తున్న ఆరోపణలపై ఒక్కరూ స్పందించరు. ఎందుకంటే బిజేపి రాష్ట్రానికి ఇచ్చే రేషన్‌ కేవలం 37 లక్షల కుటుంబాలకు మాత్రమే. కాని రాష్ట్ర ప్రభుత్వం సుమారు కోటికిపైగా కుటుంబాలకు ఇస్తున్నారు. అదికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 98లక్షలకు పైగా రేషన్‌కార్డులున్నాయి. వాటితోపాటు ఇటీవల రేషన్‌కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకున్న వారికి కూడా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాని ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేసుకోలేకపోతున్నారు. రేషన్‌ బియ్యం మొత్తం బిజేపి కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని బిజేపి ప్రచారం చేసుకుంటోంది. రేషన్‌ దుఖాణాలలో బిజేపి నాయకులు బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మీడియాకు వార్తలిస్తున్నారు. మరి కాంగ్రెస్‌ నాయకులు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నకు ఎవరు సమాదానం చెబతారు. ఇదే తీరులో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై అనేక రకాల కధనాలు వస్తున్నాయి. రోజుకో రకమైన వార్త వస్తుంది. ప్రతి మీడియా తమకు తోచిన విధంగా వార్తలు రాస్తోంది. అందుకు కారణం ఎవరో కాదు..సాక్ష్యాత్తు కాంగ్రెస్‌ నాయకులే అని చెప్పకతప్పదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట చెల్లడం లేదని, ఆయన సూచించిన లిస్టులను అధిష్టానం ఫైనల్‌ చేయడం లేదని అని లీకులిస్తారు. వార్తలు రాయిస్తుంటారు. దాని వల్ల పార్టీ పరువు పోతుందన్న ఆలోచన ఒక్క క్షణంకూడా చేయరు. కాని అలాంటి వార్తలు వస్తే మాత్రం తమలో తాము సంతోషపడుతుంటారు. అలాంటి ఇటీవల ఎక్కువయ్యారు. నాయకులు మాత్రం ఎవరన్నది అందరికీ తెలుసు. ఏది ఏమైనా పార్టీ అదిష్టానం వద్ద సిఎం. రేవంత్‌రెడ్డి,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల మాటలే చెల్లుబాటౌతున్నాయి. వారు సూచించిన వారికే మంత్రి పదవులు రానున్నాయి. నిజానికి ఆరు మంత్రి పదవులు పెండిరగ్‌లో వున్నాయి. అవన్నీ భర్తీ చేసే కార్యక్రమమే జరుగుతోంది. పైగా ఇతర పదువులు పంపకాలపై పూర్తి స్దాయిలో కసరత్తులు జరుగుతున్నాయి. అంతే కాని లిస్టు ఆగిపోలేదు. నిర్ణయాలు ఎక్కడా ఆగలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయాలపై పెద్దలు అభ్యంతరం చెప్పింది లేదు. అంటే కొంత మంది నాయకులు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతా బాగుందంటారు. లేకుంటే అంత ఇబ్బందికరమైన వాతావరణం వుందని లేనిపోని వార్తలు సృష్టిస్తుంటారు. అసలు మంత్రి వర్గ విస్తరణలో కొర్రీలుపెడుతున్నది కొ ంత మంది నాయకులే. ఎవరికి తోచిననట్లు వారు లీకులు ఇస్తున్నారు. కాని అధిష్టానం ఆలోచనలు మాత్రం ఎవరూ చెప్పరు. చెబితే వారికి వున్న ప్రాదాన్యత ఏమిటో అందరికీ తెలిసిపోతుంది. మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్సీ విజయశాంతికిచోటు కల్పించాలని అదిష్టానం అనుకుంటోంది. అందుకు సిఎం. కూడా సానుకూలంగానే స్పందించారు. కాని కొంత మంది నాయకులు లేనిపోని వార్తలు రాయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిలో మొదటివరసలో ఎమ్మెల్సీ విజయశాంతి వున్నారు. ఎందుకంటే ఆమె తన సినీ కెరీన్‌ను కూడా కాదనుకొని, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. 2005లో ఏకంగా తల్లి తెలంగాణ అనే రాజకీయపార్టీని స్దాపించారు. తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారు. అప్పటి ఉద్యమ కారుల సూచనల మేరకు పార్టీని బిఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. తొమ్మిదేళ్లపాటు అలుపెరగని పోరాటం చేశారు. ఇటు క్షేత్రస్దాయిలో జనంతో కలిసి ఉద్యమం చేశారు. మరో వైపు పార్లమెంటు సభ్యురాలిగా సభలో ఒంటరిపోరాటంచేశారు. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా 2014లో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. తన చిత్తశుద్దిని నిరూపించుకున్నారు. కాకపోతే అంత పెద్ద నాయకురాలిని కొంత కాలం కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం మానుకున్నారు. నిజం చెప్పాలంటే పెత్తనం చేసిన ఏ నాయకుడు తెలంగాణ కోసం పోరాటంచేసిన వాళ్లు కాదు. విజయశాంతిలాగా తెలంగాణ ఉద్యమం చేసిన ఒక్క నాయకుడు లేడు. దాంతో ఆమె కొంత మనస్తాపానికి గురైంది. పార్టీని వీడిరది. కాని ఆమెకు కాంగ్రెస్‌ మీద వున్న మమకారం తగ్గలేదు. అందుకే పార్టీని వీడినా వెళ్లిపోయినా, మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నది. గత ఎన్నికల్లోకాంగ్రెస్‌ పార్టీ కోసం విసృత ప్రచారం సాగించింది. తెలంగాణ ఉద్యమం కోసం అప్పట్లో అనేక త్యాగాలు చేసింది. ఇప్పుడు పార్టీ గెలుపుకోసం పనిచేసింది. కాని పదవులు ఆశించలేదు. అందుకే పార్టీ అదిష్టానం విజయశాంతి అంకితభావాన్ని గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. మంత్రిని చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఆమెకు మంత్రి పదవి ఇస్తే తమకు కుటుంబంలో మరో మంత్రి పదవి కావాలనుకుంటున్న కొంత మంది నాయకులకు ఇబ్బంది ఎదురౌతుంది. అందుకే గతంలో కూడా వారి కుటుంబాల కోసమే విజయశాంతిని దూరం పెట్టారు. ఆమెకు ప్రాదాన్యత లేకుండా చేశారు. కాని సిఎం.రేవంత్‌ రెడ్డి అధిష్టానం మాటలను జవదాటే నాయకుడుకాదు. అందుకే విజయ శాంతికి మంత్రి పదవి ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇది కొంత మందికి గిట్టడం లేదు. అందుకే కొత్తగా రంగారెడ్డి,హైదరాబాద్‌ జిల్లాలకు ప్రాదాన్యత కల్పించాలనికొత్త రాగం అందుకున్నారు. మరి కొంత మంది నాయకులు తమ కుటుంబాలలో మరొకరికి మంత్రి పదవి కావాలంటూ మూడు కుటుంబాలు రాజకీయం చేస్తున్నాయి. ఇలా ఎవరికి రాజకీయం వారు చేసుకుంటూ పార్టీలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సిఎం. రేవంత్‌రెడ్డి సూచనల మేరకే మంత్రి వర్గ విస్తరణ జరగుతుందన్న సత్యం వారికి తెలుసు. అందరికీ తెలుసు. అయినా ఆశ..ఎక్కడో చిరు ఆశ..అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. బెట్టు చేయందే తండ్రి రూపాయి ఇవ్వడు. ఇదే ఇప్పుడు కొంతమంది సీనియర్లు చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం రాజకీయాన్ని శృతిమించేలా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!