* రాత్రికిరాత్రే లక్షల విలువైన మట్టి దోపిడీ
* ఎలాంటి పర్మిషన్ లేకుండానే సాగుతున్న దందా
* డయల్ 100కు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
* నిలదీయడంతో అక్కడి నుంచి ఉడాయించిన కాంట్రాక్టర్
హసన్ పర్తి, నేటిధాత్రి:
గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ లో అక్రమ మట్టి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. దేవన్నపేట చుట్టుపక్కలా ఉన్న గుట్టలపై కన్నేసిన కొంతమంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుగా మట్టి దందా చేస్తున్నారు. రెండు రోజుల కిందట దేవన్నపేటలోని ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకులం ముందున్న గుట్టపై మైనింగ్ ప్రారంభించిన కొందరు వ్యక్తులు రాత్రికిరాత్రే లక్షల విలువైన మట్టిని తవ్వేసి, టిప్పర్ల సహాయంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో బుధవారం మధ్యాహ్నం స్థానికులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. వెంటనే డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు సకాలంలో చేరుకోకపోవడంతో గ్రామస్థులు పర్మిషన్ లేకుండా మట్టిని ఎలా తవ్వుతారని నిలదీయడంతో సరైన సమాధానం చెప్పకుండా దుండగులు అక్కడి నుంచి ఉడాయించారు.
రూ.లక్షల విలువైన మట్టి దందా
దేవన్నపేటలో ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఆ సమీపంలో ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలం లేకపోవడంతో గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వెనుకాల ఉన్న గుట్ట స్థలాన్ని కొంత తవ్వి చదును చేశారు. అదే స్థలంలో హాస్టల్ కట్టేశారు. కాగా హాస్టల్ ముందు గ్రౌండ్ నిర్మాణం మాటున ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్లకు చెందిన కొందరు అధికారులు మట్టి దందాకు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా ఓసారి ఇలాగే గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్ను మాట్లాడుకుని మట్టిని అమ్ముకోవడం ప్రారంభించి, రూ.లక్షల విలువైన మట్టిని అమ్ముకున్నారనే ఆరోపణలున్నాయి. యథేచ్చగా దందా సాగిస్తుంండటం, లారీల అతివేగంతో ప్రమాదాలు పొంచి ఉండటంతో గ్రామస్థులు అడ్డుకోవడంతో మట్టి తవ్వకాలు ఆపేశారు. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్లీ దందా ప్రారంభించారు. రెండు రోజుల కిందట మళ్లీ తవ్వకాలు ప్రారంభించి లక్షల విలువైన మట్టిని అమ్ముకున్నారు.
అనుమతి లేకుండానే తవ్వకాలు
వాస్తవానికి ఎలాంటి మట్టి తవ్వకాలు జరపాలన్నా స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు మైనింగ్ శాఖ అధికారుల నుంచి కూడా అనుమతి పత్రాలు తీసుకోవాలి. కానీ దేవన్నపేట శివారు 217 సర్వే నెంబర్ లోని గుట్ట ప్రాంతంలో మట్టిని తవ్వుతున్న కాంట్రాక్టర్ అలాంటిదేమీ లేకుండానే అధికారులను మేనేజ్ చేసుకుని దందా చేస్తున్నట్లు తెలిసింది. పర్మిషన్ ఎవరు ఇచ్చారని గ్రామస్థులు ప్రశ్నించడంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అనుమతి ఇచ్చారని ఒకసారి, మరోసారి హాస్టల్ ప్రిన్సిపల్ ఇచ్చారని మరోసారి చెప్పడం గమనార్హం. ఇదే విషయమై హాస్టల్ ప్రిన్సిపల్ ను వివరణ కోరేందుకు ఫోన్ లో సంప్రదించగా.. ఆమె స్పందించకపోవడం గమనార్హం.
విశేషాలన్నీ మాయం
దేవన్నపేట గుట్టపై హిందువులు, క్రైస్తవులకు సంబంధించిన ఆలయ ఆనవాళ్లున్నాయి. గుట్టపై వెంకటేశ్వరస్వామి, నాగమయ్య స్వామికి సంబంధించిన చిన్నపాటి గుడులు ఉండగా.. పైభాగంలో క్రైస్తవులు పూజించే శిలువ కూడా ఉంది. ఆయా ఆలయాలకు పండుగలు వచ్చిన ప్రతిసారి గ్రామానికి చెందిన భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా మైనింగ్ దందా వల్ల వెంకటేశ్వరస్వామి, నాగమయ్య స్వామి గుడితో పాటు క్రైస్తవ శిలువ కు కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటివరకు జరిపిన తవ్వకాలతో నాగమయ్య, వెంకటేశ్వరస్వామి గుడులు కూడా దెబ్బతినే స్థితికి చేరాయి. ఇప్పటికే గ్రామంలో మట్టి దందా ఎక్కువవుతుండగా.. అనుమతులు లేని తవ్వకాలతో గ్రామంలో ఆచార వ్యవహారాలకు సంబంధించిన ఆనవాళ్లకు కూడా ముప్పు పొంచి ఉంది. ఇకనైనా అక్రమ దందాకు అడ్డుకట్ట వేసి, దందాకు సహకరిస్తున్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.