
Illegal Farmhouses on Assigned Lands in Chevella
అసైన్డ్ భూములలో అక్రమ ఫామ్‌హౌస్ నిర్మాణం
* మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలకు చెక్
•కందవాడ 269అసైన్డ్ లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలు
* పనులు ఆపివేసిన టౌన్ ప్లానింగ్ అధికారి
* అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం
చేవెళ్ల,నేటిధాత్రి:
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వంటి ప్రాంతాల్లో, నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములలో బహుళ అంతస్తుల భవనాలు, ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు. చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని కందవాడ వార్డులోని సర్వే నెంబర్ 269 లో సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్ పట్టాలను నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం కేటాయించింది. కాని ఇప్పుడు ఆ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు పాగావేశారు. ప్రభుత్వ అసైన్డ్ పట్టాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నయాన బయానకు కొనుగోలు చేసి ఆ భూముల్లో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ పి.ఓ.టి చట్టానికి విరుద్దంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కందవాడ సర్వేనెంబర్ 269 లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సుమారు 100ఎకరాల అసైన్డ్ భూమి ఉంది.
ఇందులో సుమారు 80శాతం భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. ప్రభుత్వ భూములు అమ్మకూడదన్న నిబంధన ఉన్న, యతేచ్చగా విక్రయిస్తున్నారు. పట్టా భూముల ధరలు కోట్లలో ఉండటంతో, ఐదుకో పదికో చౌక ధరకు ఈ ప్రభుత్వ అసైన్డ్ పట్టా భూములను కొనుగోలు చేసి, కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు.
అసైన్డ్ లో నిర్మాణాలకు అనుమతులు ఎలా..
పట్టా భూముల్లో నిర్మాణాలు చేయాలంటేనే మున్సిపల్ శాఖ నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకునే నిర్మాణం చేపట్టాలి. కాని కందవాడలో దర్జాగా అసైన్ భూముల్లో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణదారులు రెవెన్యూ చట్ట నిబంధనలను, అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా, దర్జాగా అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. పి ఓ టి చట్టానికి విరుద్దంగా అమ్మకాలు, కొనుగోలు చేసిన ప్రభుత్వ అసైన్డ్ భూములను పి ఓ టి యాక్ట్
కింద నోటీసులు ఇచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కాని రెవెన్యూ శాఖ అధికారులు మండలపరిధిలో ఎక్కడ కఠినంగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అధికారులు కఠినంగా వ్యవహరించకపోవటంతోనే ఇలా అక్రమనిర్మాణాలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ కల్చర్ పల్లెలకు విస్తరించటంతో ప్రభుత్వ అసైన్డ్ భూములు కూడా వదలటంలేదు. అసైన్డ్ భూములను మూడవ పార్టీలకు విక్రయించడం లేదా బదిలీ చేయడం చట్టవిరుద్ధం. అయినప్పటికీ, కొన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ అండతో అసైన్డ్ భూములలో దందాలకు పాల్పడుతున్నారు. కందవాడ రెవెన్యూ మున్సిపల్ పరిది 269 అసైన్మెంట్ భూమిలో కొనసాగుతున్న అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణంపై సోమవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం చర్యలు చేపట్టారు. కమిషనర్ వెంకటేశం ఆదేశాలతో చేవెళ్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇంచార్జ్ అధికారి అమరేందర్ రెడ్డి చర్యలలో భాగంగా ఫామ్ హౌస్ నిర్మాణం పనులను నిలిపివేశారు. అనుమతులు తీసుకున్న తర్వాతే పనులు కొనసాగించాలని నిర్మాణదారులను హెచ్చరించారు.