
అధికారుల మౌనంపై ప్రజలలో అనుమానాలు
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని ఏడవవార్డులో గృహ నిర్మాణదారుడు డ్రైనేజీపై కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి నెలలు గడుస్తున్నా గ్రామ పంచాయతీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. గ్రామ పంచాయతీ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే ఇతరులకు కట్టబెట్టడం ఏమిటని గ్రామంలోని ప్రజలలో ఒకరకమైన చర్చ జరుగుతుంది. ఒకవేళ నూతన గృహ అనుమతి తీసుకున్న ఎడల నిబంధన ప్రకారం నిర్మాణం చేపట్టేల చూడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులపై ఉంటుందనేది అందరికి తెలిసిన వాస్తవం. అలాంటిది ఆగృహ నిర్మాణ యజమాని గ్రామపంచాయతీకి అందజేసిన ప్లాన్ లో ప్రకారం నిర్మాణం చేశాడా, అంతకు ఎక్కువ చేశాడా అని చూడకుండా ఉండడం చూసి ప్రజలు పలు రకాల ఊహాగానాలకు తెరలేపుచున్నారు. డ్రైనేజీపై కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టిన ఆగృహ నిర్మాణ దారునికి నోటీసు జారీ చేయకపోవడం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే గృహ నిర్మాణదారునికి గ్రామ అధికారులకు మధ్య సన్నిహిత్యం ఎలా ఉందోనని గ్రామ ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని గ్రామపంచాయతీ ఆస్తులను కాపాడాలని మండల, జిల్లా అధికారులను గ్రామ ప్రజలు కోరుచున్నారు.