మంచిగా వ్రాస్తే ఉజ్వల భవిష్యత్తు
ఐటీడీఏ,పీవో బి రాహుల్ ఐఏఎస్
భద్రాచలం నేటి ధాత్రి
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులు మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా ఏకాగ్రతతో మనసు పెట్టి ప్రత్యేక దృష్టి సారించి పరీక్షలు బాగా రాసి, ఏ గ్రేడ్ లో పాస్ కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు మంచిగా రాస్తే మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. శుక్రవారం నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విషెస్ తెలియజేస్తూ, ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేసే ఈ పరీక్షలు మీరు ప్రశాంతంగా వ్రాసేందుకు సంబంధిత హెచ్ఎం, ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కావద్దని, భయపడవద్దని, నిర్భయంగా ధైర్యంగా పరీక్షలు రాయాలని, ఈ పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయని, ఈ మైలురాయిని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయడం ద్వారా విజయం సాధిస్తారని, పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రణాళికబద్ధంగా చదివి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలు అంటే భయపడకుండా అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు రాయాలని, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు 55, వసతిగృహాలు 21, బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు 03, మొత్తం 79 ఇన్స్టిట్యూషన్లలో 2665 మంది 10వ తరగతి గిరిజన విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారని ఇందులో బాలురు 1423, బాలికలు 1242 కలిపి 2665 మంది పిల్లలు పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పిల్లల వెంట పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని,విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకమైన పరీక్షల్ని ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని, పరీక్షలు జరుగు సమయంలో వైద్య సిబ్బంది ప్రతి పరీక్షా కేంద్రంలో అందుబాటులో ఉండాలని,పారిశుద్ధ్యం, త్రాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం,తప్పనిసరిగా ఉండాలని, విద్యార్థిని విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే తగినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఐటిడీఏకు మంచి పేరు తేవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పిల్లలందరూ ఎటువంటి భయం లేకుండా, ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలు బాగా రాసి నూరు శాతం ఫలితాలు సాధించి రాష్ట్రంలోని ఐటీడీఏల కంటే భద్రాచలం ఐటీడీఏ లోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు నూరు శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలుపుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మనస్ఫూర్తిగా దీవిస్తున్నానని ఆయన తెలిపారు.-