సైకిల్‌ తో కాంగ్రెస్‌ కిల్‌!?

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ ను ఆదరిస్తే చంద్రబాబు గెలిచినట్లే!?

`చంద్రబాబు ను మళ్లీ నెత్తిమీద పెట్టుకున్నట్లే!

`కమ్మల తీర్మానంలో అంతరార్థమదే!

`తెలంగాణ సెటిలర్లు అంటే కమ్మలేనా?

`సీనియర్‌ నేతల అంతర్మధనం.

`రేవంత్‌ ను నమ్మి ఇప్పటికే నిండా మునిగాం.

` అధికారంలోకి వస్తే ఆ మాత్రం గాంధీభవన్‌ కు వెళ్లలేం.

`మొదటి లిస్ట్‌ లో తెలంగాణ ఉద్యమం చేసిన వారికి టిక్కెట్‌ రాలేదు?

`రెండో లిస్ట్‌ లో వస్తుందో లేదో తెలియదు!

`రేవంత్‌ ఒంటెద్దు పోకడ తో ఇబ్బందులు!

`కాంగ్రెస్‌ నిండా నిండిన తెలుగుదేశం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో సైకిల్‌ దిగిన నాయకులు చాలా మంది కారెక్కారు. మరి కొంత మంది హస్తం గూటికి చేరుకున్నారు. కారెక్కిన వారు తన రాజకీయ భవిష్యత్తు ఆగం కాకుండా వుండేందుకు కారులో చోటు సంపాదించుకున్నారు. హస్త వాసి బాగా లేని వాళ్లంతా కాంగ్రెస్‌ గూటికి చేరారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన వారు మాత్రం ఆపార్టీని మింగేయడానికి మాత్రమే చేరారన్న సంగతి ఆపార్టీ పెద్దలు తెలుసుకోలేకపోతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కావాలని రేవంత్‌రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. కాని చంద్రబాబు అంగీకరించలేదు. వర్కింగ్‌ ప్రెసిడెంటుతో సరిపెట్టాడు. ఎల్‌ రమణనను అద్యక్షుడిని చేశారు. రేవంత్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఎప్పటికైనా చేటు తెస్తాడన్న సంగతి చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే తెలంగాణలో తెలుగుదేశం బతకించుకోవాలి. అందుకు అప్పుడున్న నేతలతో ఆ పని కాదు. రేవంత్‌ రెడ్డి చేతిలో పెడితే తిరిగి రాదు. అప్పుడు రేవంత్‌కు రాజకీయ భవిష్యత్‌ ఆశ చూపి, సైకిల్‌ దింపి కాంగ్రెస్‌లోకి పంపించాడు. దాన్ని విజయవంతంగా చంద్రబాబు అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగారు. తన పార్టీలో అధ్యక్షపదవి ఇవ్వని చంద్రబాబు, కాంగ్రెస్‌లోకి మాత్రం రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించి పంపించారు. ఎక్కడా రేవంత్‌కు అనుమానం రాకుండా అక్కడ కూడా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇప్పించారు. ఇక అక్కడి నుంచి చంద్రబాబు ఆడిస్తున్నాడు. రేవంత్‌ ఆడుతున్నాడు.
కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పని రేవంత్‌ మొదలుపెట్టాడు.
మరో వైపు తెలుగుదేశం శ్రేణులను నింపడం షురూ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అసలైన కాంగ్రెస్‌ నాయకులకన్నా, రేవంత్‌ రెడ్డితో వెళ్లిన నాయకులే ఎక్కువయ్యారు. రేవంత్‌ పిసిసి. అధ్యక్షుడిగా వుండడంతో ఇతర పార్టీలనుంచి వెళ్లిన వాళ్లు కూడా రేవంత్‌కు సపోర్టు చేస్తున్నారు. ఇక ఆట ఇప్పుడు మొదలౌతుందని తెలుస్తోంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విడిపోవడం చంద్రబాబుకు సుతారం ఇష్టం లేదు. రాష్ట్రం విడిపోకుండా చివరి క్షణం వరకు చేయాల్సిందంతా చేశాడు. ఓ వైపు తెలంగాణ నాయకులను ఒత్తిడి చేయమని చెబుతూనే, మరోవైపు సీమాంధ్ర నేతలను అడ్డుకోమ్మని ఉసిగొల్పి ద్వంద్వ రాజకీయం నెరిపిన నాయకుడు చంద్రబాబు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటించిన మరు క్షణమే చంద్రబాబు రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి బస్సులు పంపించి, సీమాంధ్ర ప్రజలను తెలంగాణకు తరలించారు. ఎమ్మెల్యేల చేత అదే రాత్రి రాజీనామాలు చేయించారు. ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యేలనే కాదు, అప్పటి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం స్వయంగా చంద్రబాబు ఫోన్లు చేసి మరీ రాజీనామాలు చేయించారు. చంద్రబాబు మాటలు నమ్మి, ముందూ వెనక ఆలోచించకుండా అప్పటి ప్రజారాజ్యాం అధినేత చిరంజీవి కూడా రాజీనామా చేసి నవ్వుల పాలయ్యారు. చిరంజీనిని తెలంగాణకు వ్యతిరేకి అని ముద్ర పడేలా చేశాడు. చిరంజీవి రాజకీయం తుంచేశాడు. ఈ విషయం అప్పటి తెలంగాణ తెలుగుదేశం నాయకులకు కూడా తెలుసు. అయినా ఏ ఒక్కరు స్పందించలేదు.
రేవంత్‌ రెడ్డి లాంటి వారు రాజీనామా చేయలేదు.
పైగా చంద్రబాబు తెలంగాణకు అనుకూలమంటూ వితండ వాదం చేస్తూ వచ్చారు. ఆ సమయంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేసింది. అలా తెలంగాణ మీద నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన అసలే ఇష్టం లేదు. పైగా సమన్యాయం ముసుగేసుకొని డిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేసిన దుష్ట చరిత్ర చంద్రబాబుకు వుంది. అలాంటి చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఉనికికి దెబ్బతీయాలని ప్రయత్నించారు. తెలంగాణ ఏర్పాటు విఫల ప్రయత్నం అని చూపించాలనుకున్నాడు. తెలంగాణ నాయకులకు పాలన చేత కాని రుజువు చేయాలనుకున్నాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డితో రూ.50లక్షలు పంపించి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దాంతో చంద్రబాబు తెలంగాణను వదిలి వెళ్లిపోవాల్సివచ్చింది. కాని ఆయన మనసంతా తెలంగాణ మీదే వుంది. తెలంగాన రాష్ట్రంలో తన ఆధిపత్యం పోవడం చంద్రబాబుకు అసలే ఇష్టం లేదు. గత తొమ్మిదేళ్లుగా ఆయన తెలంగాణ ప్రభుత్వంమీద విషం కక్కుతూనేవున్నారు. రేవంత్‌రెడ్డి రూపంలో తెలంగాణను మళ్లీ వశం చేసుకోవాలన్న ఆలోచన చేస్తూనే వున్నాడు. ఇక గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో నామరూపాలు లేకుండా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఇక భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్‌లో గెలిచే అవకాశం లేదు. పైగా వేదింపులు మరీ ఎక్కువయ్యాయి. దాంతో చంద్రబాబు మనసు మళ్లీ తెలంగాణ మీదకు మళ్లింది. రేవంత్‌ రూపంలో కాంగ్రెస్‌ను సమాధి చేస్తే మిగిలిన వాళ్లతో తెలుగుదేశాన్ని చిగురింప చేసి లోకేష్‌కు అప్పగించాలన్న స్కెచ్‌ వేశాడు. దాన్ని అమలు చేస్తున్నాడు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో తెలంగాణలోకి రావాలనుకున్న చంద్రబాబు ఈసారి తన అరెస్టును తెలంగాణ రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నాడు.
ఎట్టిపరిస్ధితుల్లో భవిష్యత్తులో ఆంధ్రలో చంద్రబాబు గెలిచే అవకాశం లేదు. కనీసం సెటిలర్లు పెద్దఎత్తున వున్న తెలంగాణలోనేనైనా రాజకీయం వెతుక్కోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అది ఇప్పుడు ఆచరణలో పెడుతున్నాడు. అసలు హైదరాబాద్‌లో సెటిలర్లుఅంటే కేవలం కమ్మవాళ్లేనా? అన్న సోయి కూడా లేకుండా సెటిలర్లంతా తన వైపే అన్న మాయలో వున్నాడు. అసలు చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో పోరాటం చేసే దిక్కులేదు. కానీ తన అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ధర్నాలు చేయాలని చంద్రబాబు సూచించారు. దాంతో సీమాంధ్ర నాయకులు హైదరాబాద్‌లో నిరసనలు వ్యక్తం చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసలు పాలు చేయాలని చూశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ వాళ్ల ఆటలు సాగనివ్వలేదు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ కూడా వచ్చేసింది. ఈ సమయంలో కాంగ్రెస్‌ టిక్కెట్లన్నీ రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా పాత తెలుగుదేశంపార్టీ నాయకుల చేతిలో పెట్టే పని చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీలో వుంటూ తెలంగాణ ఉద్యమం చేసిన చాలా మందికి మొదటి లిస్టులో టికెట్లు రాలేదు. తర్వాత లిస్టులోనైనా వస్తాయన్న నమ్మకం పెద్దగా లేదు. మొత్తం మీద చంద్రబాబును ఈ ఎన్నికల ద్వారా తెలంగాణ రాజకీయాల్లోకి తెచ్చేఎత్తుగడ రేవంత్‌ బాగానే వేస్తున్నారు. అసలైన కాంగ్రెస్‌ నేతలను పార్టీకి దూరం చేస్తున్నారు. వాళ్లను చెట్టుకొకరిని పుట్టకొకరు వెళ్లేలా పథకం రచించాడు.
కాంగ్రెస్‌ను ఆదరిస్తే చంద్రబాబును గెలిపించినట్లే అన్నది సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలకు కూడా అర్ధమైంది.
నిన్నటిదాకా కాంగ్రెస్‌లో సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల మాటే చెల్లుబాటయ్యేది. అందులో భాగంగానే వైఎస్‌ఆర్టీపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమైంది. రేవంత్‌రెడ్డి ఎలాగైనా షర్మిలరాకను అడ్డుకోవాలని ఆదినుంచి రేవంత్‌ పట్టుదలతో వున్నాడు. షర్మిల వస్తే తన పాత్ర అపాత్రదానం చేసినట్లే అవుతుందని గ్రహించాడు. తన నాయకత్వం గందరగోళంలో పడుతుందని ఆలోచించాడు. గురువు చంద్రబాబును తెచ్చి పెట్టాలనుకున్న నిర్ణయానికి ఆదిలోనే అడ్డుకుంటు ఎదురయ్యే పరిస్ధితి గుర్తించాడు. షర్మిల రాకకు అడ్డుపుల్ల వేశాడు. షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే కేవిపి. పెత్తనం పెరుగుతుంది. అది కాస్త రేవంత్‌కు చెక్‌ పెట్టేదాక వెళ్తుంది. ఒక వేళ కష్టపడి పార్టీని గట్టెక్కించినా మళ్లీ తన రాజకీయం పాము మింగిన పుంజీతం లాగా తోకకు చేరుతుందని తెలుసుకున్నాడు. షర్మిలను రాకు పొగపెట్టేశాడు. ఇక కాంగ్రెస్‌ను పూర్తిగా తెలుగుదేశం మయం చేశాడు. ఆకుపచ్చ వనానికి పసుపు రంగు పులిమేశాడు. ఎప్పుడో అప్పుడు అందరి చేత జై చంద్రబాబు అన్న మాట అనించినా అనిపిస్తాడు. తస్మాత్‌ జాగ్రత్త..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *