
కేటీఆర్ తీరు మార్చుకోకుంటే బుద్ధి చెబుతాం
టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫైర్
“నేటిధాత్రి”, హైదరాబాద్.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అవమానకర రీతిలో మాట్లాడటాన్ని సహించబోమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ భాష దివాళాకోరుతనంతో ఉన్నదని, భాష మార్చుకోవాలని, లేకుంటే సరైన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలకు కేటీఆర్ కుటుంబం లెక్కలేనన్ని వాగ్దానాలు చేసి, ఏ ఒక్కటీ సరిగా నెరవేర్చలేదని బండి దుయ్యబట్టారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టిన కేటీఆర్ కుటుంబం తెలంగాణ వనరులను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నదని, ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. తెలంగాణ అమర వీరుల త్యాగాలకు ద్రోహం చేసిన కేటీఆర్ కుటుంబం… తెలంగాణ ప్రజల కలలను, ఆశలను వమ్ము చేసిందని బండి స్పష్టం చేశారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించిన కేటీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని బండి అన్నారు.
కేటీఆర్ కుటుంబం అవినీతి వల్లనే ఇవాళా తెలంగాణ రాష్ట్ర ఖజానా పూర్తిగా దివాళా తీసిందని బండి సుధాకర్ అన్నారు. ఇదే సమయంలో దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమంగా పట్టాలెక్కిస్తూ, ప్రగతి వైపు నడిపిస్తున్నారని, ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని బంఢి సుధాకర్ గౌడ్ ప్రశంసించారు.
ప్రజలు పూర్తిగా ఛీత్కరించినా కేటీఆర్ కు బుద్ధి రాలేదని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటూ, ప్రజలను మభ్య పెడుతున్నారని బండి సుధాకర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పోలీసు వ్యవస్థను వాడుకున్న కేటీఆర్, ఇవాళ అదే పోలీసులను బెదిరిస్తున్నాడని విమర్శించారు.
కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. ఇప్పటికైనా కేటీఆర్ తాను చేసిన తప్పుడు వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణలు చెప్పాలని, లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.