వస్తే ఈటే, పోతే అటే…

మల్కాజిగిరిలో ఆర్టీసీ బస్సుల వింత వైఖరి..

సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ రవాణా ఎంచుకుంటున్న ప్రజలు…

మల్కాజిగిరిలో ఆర్టీసీ బస్సులకు తగ్గుతున్న ఆదరణ..

మల్కాజిగిరి,నేటిధాత్రి:

ఆర్టీసీ బస్సుల వైఖరి వ్యవహరిస్తున్న తీరు మల్కాజ్గిరిలో చూస్తే పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు సరిగ్గా సరిపోతుందని బస్సులో ప్రయాణించే ప్రయాణికులు అంటున్నారు.పేరుకు పెద్ద సంస్థ అయినా ఆర్టీసీ,పనిలో మాత్రం వెనక పడిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.సమయానికి బస్సులు రాక ప్రయాణికులు బస్టాప్ లలో ఎదురుచూపులు చూసి ప్రత్యామ్నాయ రవాణా ఆటో,రాపిడో, ఓలా, సేవలను వినియోగించుకుంటూ ఆర్టీసీను విస్మరిస్తున్నారు.స్కూలు,కాలేజీ ఉద్యోగాలకు, వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు బస్సులు వస్తే ఒకేసారి నాలుగు బస్సులు వస్తున్నాయని లేకపోతే ఒక్క బస్సు కూడా జాడ ఉండదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించినందుకు సంతోషపడాల్లా,లేదా గమ్యానికి చేరుకోవడానికి ఆలస్యం చెందుతున్నందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితి ప్రయాణికుల్లో ఏర్పడిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.బస్సులు ఒకేసారి వరసగా మూడు నాలుగు రావడంతో ఏ ఒక్క బస్సులో కూడా సీట్లు నిండుకున్న దాఖలాలే లేవు.దీంతో ఆర్టీసీ మరింత నష్టపోయే అవకాశం ఉందని ప్రయాణికులు అంటున్నారు.సంబంధిత అధికారులు మల్కాజిగిరి లోని 16A, 38x బస్సు రూట్లల్లో సమయానికి అనుగుణంగా ప్రయాణికులకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంచే బాధ్యత అధికారుల పైన ఎంతైనా ఉంది. ప్రజలలో ఆర్టీసీ పట్ల ఆసక్తి తగ్గక ముందే ఆర్టీసీలోని ఉన్నత అధికారులు దృష్టి సారించి ప్రయాణికులకు సమయానికి అందుబాటులో బస్సులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *