BJP Promises Smart Municipality for Parakala
బీజేపీకి అవకాశమిస్తే స్మార్ట్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్
పరకాల,నేటిధాత్రి
మున్సిపాలిటీలో బీజేపీ చైర్మన్ పదవి చేపడితే అవినీతి లేకుండా పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని బీజేపీ పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ హామీ ఇచ్చారు. పరకాల పట్టణంలో వ్యాపార అవకాశాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిజాం పాలనకు వ్యతిరేకంగా,రెండు స్వాతంత్ర్య పోరాటాల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర గల పరకాల నేడు అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు.మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్బున్న వారికే టికెట్లు ఇచ్చి అవినీతికి పాల్పడుతున్నాయని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిగా విఫలమయ్యాయని, మహిళలకు హామీ ఇచ్చిన రూ.2500 కూడా అమలు కాలేదని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకగ్రీవంగా గెలిచిన వార్డుల్లో కూడా ఇప్పుడు ఓట్ల కోసం డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ, బీఆర్ఎస్కు ప్రజలను ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు.బీజేపీ పరకాలలో చైర్మన్ పదవి చేపడితే రూపాయి ఖర్చు లేకుండా ఇంటి నిర్మాణ పర్మిషన్లు ఇస్తామని తెలిపారు.దోమల నివారణతో పాటు పందులు, కోతుల బెడద నివారణకు ప్రతి కౌన్సిలర్ బాధ్యతగా కృషి చేస్తారని చెప్పారు.ప్రతి వార్డులో జనరిక్ మెడికల్ షాప్లు ఏర్పాటు చేస్తామని, అవినీతి జరిగితే ఏఐ ద్వారా ఆడిటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన స్మార్ట్ మున్సిపాలిటీ విధానాన్ని పరకాలలో అమలు చేస్తామని పేర్కొంటూ,పట్టణంలోని ఇంటి పన్నులు పెంచబోమని హామీ ఇచ్చారు.ప్రతి వార్డులో చైర్మన్,కౌన్సిలర్ల ఫోన్ నెంబర్లు ప్రదర్శిస్తామని,ప్రతి ఇంటికి అంబులెన్స్ వెళ్లేలా రోడ్ల అభివృద్ధి చేస్తామని తెలిపారు.పరకాలకు మెడికల్ కాలేజీ నిర్మాణం,వ్యాపార రంగ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని పేర్కొంటూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ ప్రజలను కోరారు.
