నేనే సిఎం..జాతకం చెప్పుకున్న జానారెడ్డి.

https://epaper.netidhatri.com/

`కాంగ్రెస్‌ రాజకీయాలలో జానా మళ్ళీ సంచలనం.

`ఔననలేక, కాదనలేక రేవంత్‌ రెడ్డిలో కలవరం.

`జానా పంపిన ముందస్తు సందేశం.

`ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ లో కలకలం.

`కాంగ్రెస్‌ లో మొదలైన గందరగోళం!

`ఇలాంటి పరిస్థితి రావొద్దనే ఆయన ను పక్కనపెట్టింది.

`ఆలు లేదు, చూలు లేదు సామెత ఎప్పటికైనా కాంగ్రెస్‌ తోనే నిజం .

`అప్పుడే మొదలైన పదవుల పంపకం.

`తెలంగాణ భవిష్యత్తు గాలి కొదిలేయడం ఖాయం.

`అభ్యర్థుల ఎంపికే పూర్తి కాలేదు.

`ఎన్నికల ప్రచారమే కాంగ్రెస్‌ మొదలుపెట్టలేదు.

`తెలంగాణ రాక ముందు నుంచి జానారెడ్డిది అదే మాట.

`రేవంత్‌ రెడ్డి గొంతులో అప్పుడే పచ్చి వెలక్కాయ!

`కాంగ్రెస్‌ వస్తే వాళ్లలో వాళ్లకు కొట్లాటలు తప్పవు?

`తెలంగాణను ఆగం చేయకుండా ఊరుకోరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
జానారెడ్డి తానే కాబోయే ముఖ్యమంత్రిని అన్నారంటే ఫినిష్‌. తన జాతకం తాను చెప్పుకున్నారంటే కాంగ్రెస్‌ పని ఖతం. ఇది సెంటిమెంటుగా మారింది. ఆయన అన్నారంటే చాలు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెవడం కష్టం. మళ్లీ జానారెడ్డి ఆశలు సజీవం కావడం సహజం. ఇలా 2009 నుంచి సాగుతూనే వుంది. కాని పాపం ఆయన జాతకం మారిందిలేదు. భవిష్యత్తు ఆశా జనకమైంది లేదు. తన కోరిక తీరింది లేదు. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనన్ని శాఖలకు మంత్రిగా పనిచేసిన ఘనత జానారెడ్డి దక్కించుకున్నారు. అందరికన్నా సుదీర్ఘ కాలం మంత్రిగా పనిచేశారు. అందుకే నాకంటే అర్హత ఎవరికుంది? నాకున్న అనుభవం ఎవరికి వుంది? అంటూ ఆయన చెబుతుంటారు. ఇప్పుడూ అదే చెబుతున్నారు. ఈసారి మరీ విచిత్రంగా పదవులు తనకు కలిసి రావడం కాదు..తానే పదవులకు కలిసి వస్తానంటూ కొత్త భాష్యాలు కూడా చెబతున్నాడు. అంటే పదవులు తనకు ఎన్నడూ వన్నె తేలేదు కాని , తానే పదవులుకు వెన్నె తెచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నారన్న మాట. ఈసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తున్నాడు. అయినా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే మాత్రం నేనే సిఎం. అంటూ మళ్లీ జోస్యం చెప్పుకున్నారు. ఇదే ఆయన కొంప ముంచుకోవడమే కాదు… ఏకంగా పార్టీ కొంప ముంచడమే. ఆయన గత ఎన్నికలో, ఉప ఎన్నికలో మాత్రం ఓటమి పాలయ్యారు. ముందస్తు ఎన్నికల సమయంలో ఇక తాను ముఖ్యమంత్రి అయినట్లే అని ఎంతో మురిశారు. కాని ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ కూడా అంతకంతగా తీసికట్టినట్లే 2014లో వచ్చిన సీట్లకన్నా తక్కువ వచ్చాయి. దాంతో ఇక జనారెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న ఆశలు వదులుకున్నట్లే అని అంరదూ అనుకున్నారు. కాని ఒక్కసారిగా జానారెడ్డి మళ్లీ మోట కొండూరులో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వాతావరణం మారేందుకు దోహదపడుతున్నాయి. రాజకీయాలు చేసేవారు ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావాలి, ప్రదానమంత్రి కావాలని కలలు కనడం సహజం. అలా ఒక్కొమెట్టు ఎక్కుతూ ఎదిగిన వాళ్లుకు ఆ ఆశ మరింత ఎక్కువ. అలాగే జానారెడ్డి అనే నేను అని అనే సార్లు చెప్పారు. కాని కేవలం అది ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రిగా పలు ధఫాలుగా కూడా అన్నారు. కాని ఆయనకు ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయింది. తెలంగాణ ఉద్యమం లేకపోతే జనారెడ్డికి ఆ ఆశ కలలో కూడా వుండకపోయేది. కాని తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని ఆయన నేనే ముఖ్యమంత్రిని అని కలవరింత మొదలుపెట్టినట్లున్నాడు.
జానారెడ్డి ఇలా సందర్భం వున్నా, లేకునా ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు తాను ముఖ్యమంత్రిని అని పదేపదే చెప్పుకోవడం అలవాటు చేసున్నాడు.
నిజంగా ఆయన ఆది నుంచి కాంగ్రెస్‌ వాదా? అంటే కాదు. ఆది నుంచి కాంగ్రెస్‌లోనే వున్నాడా? అంటే అదీ లేదు. తెలుగుదేశంలో కూడా వున్నాడు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో పనిచేశారు. ఎన్టీఆర్‌ మంత్రివర్గం నుంచి తొలగించడంతో అక్కడ ఇమడలేక, కాంగ్రెస్‌లోకి వచ్చారు. అప్పటి నుంచి, ఇక అక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లలేక అక్కడే వున్నాడు. అంతే తప్ప ఆయన ఆది నుంచి కాంగ్రెస్‌లోనే లేడు. కాని నాకంటే సీనియర్‌ ఎవరు? వున్నారంటూ చెప్పుకుంటుంటారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కావడానికి ఆయనకు వున్న అర్హత ఏమిటన్నది మాత్రం ప్రజలకు తెలియాల్సిన అసవరం వుంది. అయితే కాంగ్రెస్‌లోఏదైనా సాధ్యమే. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే అదీ సాధ్యమే…కాని ఇప్పుడున్నది ఆ కాంగ్రెస్‌ కాదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు చోటు లేదు. అంటే జానారెడ్డే కాదు, ఏ కాంగ్రెస్‌ నాయకుడికి తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. పైగా జానారెడ్డికి అసలే లేదు. ఎందుకంటే ఆయన ఒక్కనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో జై తెలంగాణ అని అసెంబ్లీలో అన్నది లేదు. రోడ్దు మీదకు వచ్చి నినదించింది లేదు. తెలంగాణ కోసం కొట్లాడిరది లేదు. ఉమ్మడి పాలకులను నిలదీసింది లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఆయన చేసింది లేదు. ఒరగబెట్టింది లేదు. కనీసం ఆ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను కూడా తీర్చలేకపోయాడు. ఎంత సేపు పదవులు తప్ప, ఉమ్మడి పాలకులకు భజన తప్ప చేసిందేమీ లేదు. తెలంగాణ కోసం గొంగలిపరుగునైనా ముద్దాడుతా! అని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఒక దశలో జానారెడ్డి ఇంటకి వెళ్లి ఆయనను ఉద్యమంలోకి ఆహ్వానించారు. అయినా ఆయన తెలంగాణ ఉద్యమానికి తోడుగా నిలిచింది లేదు. అధిష్టానాన్ని అడిగింది లేదు.
2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత జానారెడ్డికి ఆశ మొదలైంది.
తెలంగాణ వస్తే తానే ముఖ్యమంత్రి అన్న ఆలోచన మొదలైంది. అయినా తెలంగాణ ఇస్తారా? అన్న అనుమానమే ఆయనలో ఆది నుంచి వుంది. 2009లో తెలంగాణ ప్రకటించిన తర్వాత సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులంతా రాజీనామాలుచేశారు. వచ్చిన తెలంగాణను వెనక్కి వెళ్లేలా చేశారు. దాంతో తెలంగాణ సమాజం ఒక్కసారి భగ్గుమన్నది. కాని జానారెడ్డిలో ఎలాంటి చలనం లేదు. ఆ సమయంలో తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంద్ర ఎమ్మెల్యేలు ఎలా రాజీనామాలు చేశారో..అలాగే వెనక్కి తీసుకున్న మరుక్షణం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చారు. దాంతో తెలంగాణ మంత్రులు , ఎమ్యెల్యేలు చాలా తెలివిగా స్పీకర్‌ ఫార్మెట్‌లో కాకుండా తెలంగాణ కోసం రాజీనామా? చేస్తున్నామంటూ అప్పటి స్పీకర్‌కు ఓ లెటర్‌ ఇచ్చారు. కాని దాన్ని స్పీకర్‌ ఎట్టిపరిస్ధితుల్లోనూ ఆమోదంచరని తెలుసు. అయితే మంత్రులుగా వున్న జానారెడ్డి లాంటి వాళ్లు మంత్రి పదవులకు మాత్రం రాజీనామా చేయలేదు. ఒక వేళ మంత్రి పదవులకు రాజనామా చేస్తే ఇదే అదునుగా అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఎక్కడ తమ రాజీనామాలు ఆమోదిస్తారో అన్న భయంతో ఎమ్మెల్యే పదవులకు మాత్రం రాజీనామా చేశారు. అలాంటి జానారెడ్డి 2014 ఎన్నికల్లో ఇక నేనే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నారు. ఆనాటి నుంచి ఆ ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. 2018 ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు. కాని నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ప్రజలు జానారెడ్డిని ఓడిరచారు. అయితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించడంతో వచ్చిన ఉప ఎన్నికలో ఇక ఇదే నా ఆఖరు ఎన్నికలపోటీ అంటూ ప్రజల సానుభూతి సంపాదించుకోవాలని చూశాడు. కాని జనం మెచ్చలేదు. ఆయనకు మద్దతు పలకలేదు. ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. కాని కాంగ్రెస్‌కు ఊపు కనిపిస్తుందన్న ప్రచారం ఊపందుకోవడంతో మళ్లీ తానే సిఎం అంటూ మరోసారి ప్రకటించారు. కాంగ్రెస్‌ను అయోమయంలోకి నెట్టేశారు.
కాంగ్రెస్‌లోఅంతే.. కాకపోతే ఒక్కసారి పోనీలే అనుకుంటే మాత్రం తర్వాత ఇబ్బంది పడేది మళ్లీ అదే జనం.
కాంగ్రెస్‌ అంటేనే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అనే నానుడి వుండనే వుంది. పొరపాటును కాంగ్రెస్‌ను ఆదిరిస్తే పదవుల్లో ఒదిగిపోతారు. పరిపాలన లో వాళ్లు ఆదమర్చితోతారు. ఎన్నికల కోసం పడినంత ఆరాటం గెలిచిన కాంగ్రెస్‌నాయకుల్లో కనిపించడు. అభివృద్ధి చేయాలన్న ఆలోచన అసలే కనిపించదు. అలా తెలంగాణను కాంగ్రెస్‌ బాగు చేస్తే తెలంగాణ ఉద్యమమే వుండేది కాదు. కాంగ్రెస్‌ నేతల చేత గాని తనం, స్వార్ధం మూలంగానే తెలంగాణ ఉమ్మడి పాలకులచేతుల్లో బంధీ అయ్యింది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సీమంధ్ర నేతల కనుసన్నల్లో రాజకీయం చేయడం అలవాటైంది.. అధికారం సీమాంధ్ర నేతలకు, పదవులు పందేరంలో పాలెర్లుగా తెలంగాణకాంగ్రెస్‌ నేతలు వెన్నెముక లేకుండా వుండేవారు. అందుకే తెలంగాణను ఆనాడు ఉమ్మడిపాలకులు దోచుకున్నారు. తెలంగాణను ఆగం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ నేతల్లో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన కన్నా,పదవులు పొందాలన్న ఆరాటమే ఎక్కువ కనిపిస్తోంది. అది జానారెడ్డి వ్యాఖ్యలతో తేలిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!