శేరిలింగంపల్లి,నేటి ధాత్రి:-
చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. బక్షికుంట, రేగులకుంట చెరువులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గత కొన్నాళ్లుగా బక్షి కుంట చెరువు కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులతో కలిసి బక్షికుంట పరిసరాలను పరిశీలించి ఆక్రమణల గూర్చి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చెరువు విస్తీర్ణం, ఎప్పటి నుంచి ఆక్రమణలు జరుగుతున్నాయి. పర్మిషన్లు ఎలా ఇచ్చారు అన్న దానిపై ఆరా తీశారు. చెరువులో ఉన్న నిర్మాణాలు, రోడ్లు ఎవరేశారు అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చందానగర్ లోని రేగులకుంట చెరువును మల్లిగవాడ ఫౌండేషన్ చైర్మన్ ఆనంద్ మల్లిగవాడతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా తనపని తాను చేసుకుపోతుందని, ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తప్పవని అన్నారు. హైడ్రా కమిషనర్ వెంట రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నాగరాజు, నళిని, రాజశేఖర్, సీపీఎం నాయకులు శోభన్, కృష్ణ, సీపీఐ నాయకులు రామకృష్ణ, చందు యాదవ్, దీప్తి శ్రీనగర్ కాలనీ ప్రెసిడెంట్ సీతారామయ్య ఇతర కాలనీవాసులు పాల్గొన్నారు.