
Trump Tariffs Could Cut US Trade Deficit by $3.3 Trillion
టారిఫ్లతో అమెరికాకు ఎంత ప్రయోజనం కలుగుతుందంటే..
ట్రంప్ అధిక సుంకాలతో అమెరికా విత్త లోటు వచ్చే పదేళ్లల్లో 3.3 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీసు నివేదికలో వెల్లడైంది. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీల్లో కూడా 0.7 ట్రిలియన్ డాలర్ల మేర కోత పడే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపుతో ప్రపంచ వాణిజ్యం అస్తవ్యస్తంగా మారిపోయింది. తమపై కూడా ధరాభారం పెరుగుతుందన్న భయం అమెరికా ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టారిఫ్ల ద్వారా అమెరికాకు కలిగే ప్రయోజనం గురించి అక్కడి చట్టసభల ఆధ్వర్యంలో ఓ అధ్యయనం జరిగింది. దీనికి సంబంధించిన విషయాలను శుక్రవారం విడుదల చేశారు.
అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ప్రకారం, ట్రంప్ సుంకాలు ఇలాగే కొనసాగితే వచ్చే పదేళ్లల్లో విత్తలోటు సుమారు 3.3 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీల్లో కూడా 0.7 ట్రిలియన్ డాలర్ల మేర కోత పడుతుంది. అయితే, సుంకాలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలు కూడా తక్కువని బడ్జెట్ ఆఫీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. వివిధ దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుండటంతో సుంకాలు తగ్గుతాయని చెబుతున్నారు.
అమెరికా ట్రెజరీ లెక్కల ప్రకారం, ప్రస్తుతం ప్రభుత్వంపై మొత్తం అప్పుల భారం 37.18 ట్రిలియన్ డాలర్లు. ఏటా ఈ అప్పుల బెడద పెరుగుతూనే ఉంది. మరోవైపు, ఆదాయానికి మించి ఖర్చులు పెట్టడం మినహా అమెరికా ప్రభుత్వం ముందు మరో ప్రత్యామ్నాయం లేదు.
ఈ నేపథ్యంలో అధిక ఖర్చులకు చట్టసభలు ప్రభుత్వానికి అనుమతిస్తూనే ఉన్నాయి. ఫలితంగా అప్పుల భారం అంతకంతకూ పెరుగుతోంది. ఈసారి ఖర్చులకు సంబంధించిన డెడ్లైన్ సెప్టెంబర్లో ఉంది. అప్పటికి అమెరికా కాంగ్రెస్ అదనపు ఖర్చులకు అనుమతించని పక్షంలో ప్రభుత్వ మొత్తం షట్ డౌట్ అయ్యే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సగటు సుంకం 16.7 శాతంగా ఉంది. జులైలో ఇది 15.1 శాతంగా ఉండేది. ఇప్పటివరకూ సుంకాల రూపంలో అమెరికా ఖజానాకు 26 బిలియన్ డాలర్లు చేరాయని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఇది అనేక రెట్లు ఎక్కువని తేల్చింది.